Venkateswara Temple in Jammu : వేంకటేశ్వరుడి భక్తులు ఇకనుంచి జమ్మూలో కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు.. అందుకు సంబంధించిన పనులు చక చకా జరుగుతున్నాయి. తాజాగా జమ్మూ కశ్మీర్ పరిపాలనా మండలి ఆలయ నిర్మాణానికి 62 ఎకరాలు కేటాయించింది. మజీన్ గ్రామంలో 62.02 ఎకరాల భూమిని ఇవ్వడానికి ఓకే చెప్పింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని కౌన్సిల్… శ్రీనగర్-పఠాన్‌కోట్ రహదారి వెంట సిధ్రా బైపాస్‌లో భూమిని తితిదేకు 40 సంవత్సరాల లీజుకు కేటాయించే ప్రతిపాదనను ఆమోదించింది.
పర్యాటక రంగ అభివృద్ధి కోసం జమ్మూలో ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు తెలుస్తోంది.. ఆలయ నిర్మాణం పూర్తయితే.. మాతా వైష్ణోదేవీ ఆలయం, అమర్నాథ్ క్షేత్రాల తరహాలో పర్యాటకులు వస్తారని తద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని నాయకులు చెబుతున్నారు. ఆలయం, దాని అనుబంధ మౌలిక సదుపాయాలు, యాత్రికుల సౌకర్యాల సముదాయం, వేద పాఠశాల, ధ్యాన కేంద్రం, ఆఫీసు, రెసిడెన్షియల్ క్వార్టర్స్, పార్కింగ్ వంటి వాటికి… స్వాధీనం చేసుకున్న తేదీ నుంచి 40 సంవత్సరాల కాలానికి లీజు ప్రతిపాదన ఆమోదించారు. ఇకనుంచి జమ్మూ మరో తిరుమలగా మారనుందని అర్థం. అంతేకాకుండా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు రాలేని ఉత్తర భారత ప్రాంత వాసులు జమ్మూకు వెళ్లి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.