మెడికల్ కాలేజీలో ఘోరం.. అప్పుడే పుట్టిన 60 మంది చిన్నారులు మృతి! ఒక్క రోజులోనే 10 మంది..

ఆగస్టు నెలలో తొలి మూడు వారాల్లో ఆసుపత్రిలో 60 మంది చిన్నారులు మృతి చెందడం ఆందోళనకు కారణమైంది. ముఖ్యంగా రెండో వారంలో ఒకే రోజున 10 మంది చిన్నారులు మరణించడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి రాష్ట్ర ఆరోగ్య శాఖ..

మెడికల్ కాలేజీలో ఘోరం.. అప్పుడే పుట్టిన 60 మంది చిన్నారులు మృతి! ఒక్క రోజులోనే 10 మంది..
Infant Deaths In West Bengal

Updated on: Aug 27, 2026 | 3:20 PM

మాల్దా, ఆగస్ట్‌ 27: పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (MMCH)లో చిన్నారుల మరణాలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఆగస్టు నెలలో తొలి మూడు వారాల్లో ఆసుపత్రిలో 60 మంది చిన్నారులు మృతి చెందడం ఆందోళనకు కారణమైంది. ముఖ్యంగా రెండో వారంలో ఒకే రోజున 10 మంది చిన్నారులు మరణించడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి రాష్ట్ర ఆరోగ్య శాఖ వివరణాత్మక నివేదికను కోరింది. ఆసుపత్రి పరిస్థితులపై సమగ్ర సమీక్ష చేపట్టడంతో పాటు, చిన్నారులను మొదటగా చికిత్స చేసిన ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, బ్లాక్ స్థాయి ఆరోగ్య కేంద్రాలపైనా అధికారులు దృష్టి సారించారు.

ఒకే రోజులో 10 మంది చిన్నారుల మృతి

ఆసుపత్రిలో ఒకే రోజున 10 మంది చిన్నారులు మృతి చెందారు. వీరిలో ఎనిమిది మంది ఇతర ఆసుపత్రుల్లో జన్మించిన శిశువులు కాగా, పరిస్థితి విషమించడంతో వారిని MMCHకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు చిన్నారులు MMCHలోనే జన్మించారు. మృతిచెందిన నవజాత శిశువుల్లో కొందరికి శ్వాస సంబంధిత సమస్యలు, కామెర్లు, పుట్టుకతో వచ్చిన గుండె సంబంధిత లోపాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆగస్టులో నమోదైన మొత్తం 60 మంది చిన్నారుల మరణాల్లో 44 మంది ఇతర ఆసుపత్రులు, వైద్య కేంద్రాల్లో జన్మించిన శిశువులే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో MMCHకు రిఫర్ చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో చిన్నారులకు తొలుత చికిత్స అందించిన ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లలో వైద్యం, రిఫరల్ ప్రక్రియ, చికిత్సలో తీసుకున్న చర్యలపై కూడా అధికారులు పరిశీలన చేస్తున్నారు.

16 ఆసుపత్రుల్లో తనిఖీలు..

విచారణలో భాగంగా ఇప్పటివరకు 16 ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లను అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల ద్వారా చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమించడానికి గల కారణాలు, వారికి అందిన ప్రాథమిక చికిత్స, MMCHకు తరలించిన సమయంలో వారి పరిస్థితి వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతుండగా, రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక నివేదిక సమర్పించినట్లు సమాచారం. MMCH సూపరింటెండెంట్ ప్రసేంజిత్ బార్ చిన్నారుల మరణాలను ధృవీకరించారు. ఒకే రోజున 10 మంది చిన్నారులు మరణించిన విషయం వాస్తవమేనని, వారిలో ఎనిమిది మందిని అత్యంత విషమ పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల నుంచి ఆసుపత్రికి తీసుకొచ్చారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖకు సమర్పించేందుకు ఆసుపత్రి నుంచి వివరణాత్మక నివేదిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాల్దా జిల్లా మేజిస్ట్రేట్ గురువారం సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించనున్నారు. కొనసాగుతున్న దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలను పరిశీలించడంతో పాటు, చిన్నారుల మరణాలకు దారితీసిన పరిస్థితులపై చర్చించనున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నందున, మరణాలకు ఖచ్చితమైన కారణాలు అధికారిక విచారణ పూర్తయ్యే వరకు నిర్ధారించలేమని అధికారులు భావిస్తున్నారు. పూర్తి నివేదిక అనంతరం పరిస్థితిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us