Thane – Oxygen Shortage: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం లక్షలాది మంది కరోనా బారిన పడుతుండగా.. వేలాది మంది మరణిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితిల్లో ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. గత నాలుగు రోజుల నుంచి ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతతో వందలాది మంది మరణించారు. ఈ క్రమంలో ప్రాణవాయువు అందక మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్రలోని థానే నగరంలో కూడా ఆక్సిజన్ కొరతతో ఆరుగురు కరోనా బాధితులు మరణించారు. థానేలోని వేదాంత్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లేకపోవడంతో ఆరుగురు కరోనా రోగులు మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
ఇదిలఉంటే.. మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలో 66వేలకు పైగా కేసులు నమోదు కాగా.. రికార్డు స్థాయిలో 832 మంది మరణించారు.
కాగా.. ఇటీవల నాసిక్‌లో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలగడంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు దేశరాజధాని ఢిల్లీలోని ఆక్సిజన్ సరఫరా లేక 50 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసులు, మరణాల పరంగా మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతోంది.
Also Read: