
Odisha Accident: మరి కాసేపట్లో పెళ్లి.. అంతా రెడీ అయ్యారు.. మరికొంత దూరంలోనే వధువు ఇల్లు ఉంది.. దీంతో వరుడు సహా.. అతని బంధు మిత్రులు ఊరేగింపుగా వెళ్తున్నారు. ఇంతలోనే.. లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా.. 10మంది గాయపడ్డారు. దీంతో వివాహ వేడుక కాస్త.. విషాదంగా మారింది. వివాహ ఊరేగింపుపైకి ట్రక్కు దూసుకెళ్లిన ఘటన ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. జాతీయ రహదారి-20 సమీపంలోని సతీఘర్ సాహి వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీఘర్ సాహికి చెందిన కార్తీక్ పాత్ర కుమార్తె, హరిచందన్‌పూర్ బ్లాక్ పరిధిలోని మాన్‌పూర్ గ్రామానికి చెందిన హడిబంధు పాత్ర కుమారుడు హేమంత పాత్రతో వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వరుడు, అతని బంధుమిత్రులు DJ మ్యూజిక్ తో బరాత్ గా వధువు ఇంటికి వెళ్తున్నారు. వధువు ఇంటికి కొంత దూరంలో ఉండగానే.. తెల్లవారుజామున 1.30 గంటలకు ఒక ట్రక్ ఊరేగింపు వైపు దూసుకొచ్చి ఢీకొట్టినట్లు తెలిపారు.
ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి కియోంజర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..