చెన్నై, జనవరి 26: తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో తోప్పూర్ ఘాట్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై నాలుగు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. క్షణాల వ్యవధిలో పెను విధ్వంసం సృష్టించిన ఈ ప్రమాదంలో ఓ లారీ బ్రిడ్జ్ నుంచి పల్టీలు కొడుతూ కింద పడిపోయింది. ప్రమాద స్థలిలో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు అలముకున్నాయి. బ్రిడ్జిపై భీతావహ దృశ్యం తలపించింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తమిళనాడు రాష్ట్రలోని ధర్మపురి జిల్లాలో తోప్పూర్ ఘాట్ రోడ్డుపై వేగంగా వస్తున్న ట్రక్కు మరొక ట్రక్కును ఢీకొట్టింది. దీంతో అదే రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనాలు కూడా ఒకదాని కొకటి ఢీకొన్నాయి. తొలుత ఢీకొన్న ట్రక్కు అదుపు తప్పి మరో ట్రక్కును ఢీకొట్టడంతో రెండు వాహనాల మధ్య ఓ కారు నలిగిపోయింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా, ట్రక్కు రోడ్డు రెయిలింగ్‌ను ఢీకొని వంతెనపై నుంచి పల్టీలు కొడుతూ కింద పడిపోయింది. ఘటనా స్థలం నుంచి లభించిన సీసీటీవీ ఫుటేజీ ప్రమాద సంఘటనలను చిత్రీకరించింది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సాయం ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి రూ.50,000 పరిహారం ప్రకటించారు. అగ్నిమాపక దళం, ఇతర అత్యవసర సేవా బృందాలు సహాయం చేయడానికి సంఘటన స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు వేగంగా ప్రారంభించాయి. ఈ ఘటనలో ట్రక్కులకు మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగిన ప్రదేశంలో దట్టమైన పొగలు కమ్ముకోవడం సీసీటీవీ వీడియోలో చూడొచ్చు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలివేటెడ్ నేషనల్ హైవే పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ధర్మపురి ఎంపీ, డీఎంకే నేత కేంద్రాన్ని కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.