
ఆ జిల్లాని పాములు బారిన పడే ప్రాంతంగా పిలుస్తారు. ఎందుకంటే జిల్లాలో ఎక్కువగా పాము కాటు ఘటనలు నమోదవుతుంటాయి. అదే జిల్లాలో 9ఏళ్ల అమృత్ సాయి బాగియాలోని గిరిజన హాస్టల్లో 3వ తరగతి చదువుతున్నాడు. బాగా చదివి కుటుంబాన్ని బాగా చూసుకోవాలనేది ఆ బాలుడి కల. అయితే ఇప్పుడు ఆ కల కనడానికి ఆ బాలుడే లేకుండా పోయాడు. హాస్టల్ అధికారుల నిర్లక్ష్యంతో అమృత్ ప్రాణాలు కోల్పోయాడు. అసలేం జరిగిందంటే.. హాస్టల్లో అమృత్‌ను పాము కరిచింది. ఆ తర్వాత కొన్ని గంటలకే అతడు మరణించాడు. ఈ ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. హాస్టల్ సూపరింటెండెంట్ ఠాకూర్ దయాళ్ సింగ్ సహా మరో అధికారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పూర్ జిల్లాలో జరిగింది.
బాలుడిని పాము కరిచిన వెంటనే ఠాకూర్ సింగ్ దగ్గరలోని ఆస్పత్రికి కాకుండా దూరంలో ఉన్న కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దీంతో సకాలంలో చికిత్స అందక బాలుడు మరణించాడు. ఈ ఘటనపై కలెక్టర్ రోహిత్ వ్యాస్ సీరియస్ అయ్యారు. వెంటనే ఠాకూర్ సింగ్‌తో పాటు హాస్టల్ అటెండెంట్ రామ్‌కున్వర్‌లను విధుల నుంచి తొలగించారు. హాస్టల్ నిర్వాహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో విషపూరిత జీవులు ఎక్కువగా సంచరిస్తుంటాయని.. ఇటువంటి సమయంలో అధికారుల నిర్లక్ష్యం బాలుడి ప్రాణం తీసిందని కలెక్టర్ ఫైర్ అయ్యారు.
అంతేకాకుండా బాధిత కుటుంబానికి కలెక్టర్ అండగా నిలిచారు. రూ.4లక్షల ఆర్థికసాయం అందజేశారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని స్కూళ్లు, హాస్టళ్లలో నిరంతరం తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా స్కూళ్లు, హాస్టళ్లు క్లీన్‌గా ఉంచుకోవాలని సూచించారు. దీనికి సంబంధించి అవగాహన డ్రైవ్‌లు నిర్వహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.