పంజాబ్ లో తాము అధికారంలోకి వచ్చిన పక్షంలో రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీనివల్ల ఈ రాష్ట్రంలో 77శాతం నుంచి 80 శాతం వరకు ప్రజలకు విద్యుత్ బిల్లులు చెల్లించే బెడదే ఉండదన్నారు. మంగళవారం చండీ గఢ్ లోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇక్కడ పాత కరెంట్ బిల్లుల బకాయిలను కూడా మాఫీ చేస్తామని చెప్పారు. తమ ఢిల్లీలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. ‘ఇది నేను ఇస్తున్న హామీ.. కెప్టెన్ (అమరేందర్ సింగ్) కాదు.. మా హామీలను నెరవేరుస్తాం…ఆప్ అధికారంలోకి వచ్చిన పక్షంలో తక్షణమే మొట్టమొదట పాత బిల్లులను ఎవరూ చెల్లించకుండా చూస్తాం అని కేజ్రీవాల్ చెప్పారు. పంజాబ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. తమ పొరుగున ఉన్న ఈ రాష్ట్రంలో కూడా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఆప్ తహతహలాడుతోంది. కాగా ఢిల్లీలో లోగడ ఇచ్చిన పలు హామీలను నెరవేర్చడంలో ఆప్ విఫలమైంది. ఎంత సేపూ విద్యుత్ బిల్లుల గురించే కేజ్రీవాల్ మాట్లాడుతున్నారని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
2017 లో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో 117 సీట్లకు గాను ఆప్ 20 సీట్లను మాత్రం దక్కించుకుంది. 77 స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం సీఎం అమరేందర్ సింగ్ తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఇది వచ్చే ఎన్నికల్లో ఆప్ కు వరం కావచ్చునని భావిస్తున్నారు. ఇక్కడి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కేజ్రీవాల్ పదేపదే వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Chiranjeevi : చిరంజీవి గురించి వచ్చిన వార్తలన్నీ అచ్చి అబద్దం.. ఎఐసిసి, ఎపిసిసి స్పష్టీకరణ