ప్రభుత్వాలు ఎంత కఠినంగా ఉన్నాగంజాయి విక్రయం, వినియోగం ఆగడం లేదు. దేశవ్యాప్తంగా నిత్యం ఏదోచోట గంజాయి, డ్రగ్స్ దొరకడం పరిపాటిగా మారింది. పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా, ఎంత పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్న అక్రమార్కులు మాత్రం ఆగడం లేదు. రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటూ రెచ్చిపోతున్నారు. గంజాయి స్మగ్లింగ్ చేయడానికి కొత్త దారులను వెతుకుతున్నారు. తాజాగా ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ చక్ సమీపంలో 38 కేజీల గంజాయిని శరీరానికి చుట్టి అక్రమంగా తరలించేందుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.
నిందితులను ఉలిస్తాన్ నగర్ గ్రామానికి చెందిన మహ్మద్ ఫియాజాన్ (25), మహారాష్ట్రలోని అమరావతి జిల్లా యాష్మిన్ నగర్ గ్రామానికి చెందిన షేక్ షరీక్ (45)గా గుర్తించారు. సబ్-ఇన్‌స్పెక్టర్ అజిత్ సింగ్ బరిహా నేతృత్వంలోని ఓర్కెల్ పోలీసుల బృందం సోమవారం పెట్రోలింగ్ నిర్వహిస్తుంది. ఈ సమయంలో అటుగా వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించారు. పోలీసులను చూసి తత్తరపాటుకు గురయ్యారు. పోలీసులు రమ్మని పిలవగా… పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు.
సోదాల్లో 38.2 కిలోల గంజాయి చుట్టి వారి బాడీలకు అతికించినట్లు గుర్తించారు. వారి నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.2100 స్వాధీనం చేసుకున్నారు. చిత్రకొండకు చెందిన సునాధర్ ఖిల్లా గంజాయి సరఫరాదారుగా పోలీసులు గుర్తించారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..