Dog Meat: మటన్‌ పేరుతో.. బెంగళూరుకు కుక్క మాంసం రవాణా.. నిజమేనా…

|

Jul 28, 2024 | 1:12 PM

రెస్టారెంట్లలో నాన్‌వెజ్ తినాలంటేనే బెంబేలెత్తిపోయే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. చికెన్‌, మ‌ట‌న్ పేరుతో కల్తీ మాంసాలు విక్రయిస్తున్నార‌నే ప్రచారంతో రెస్టారెంట్లకు వెళ్లి తినాలంటేనే భయపడాల్సి వస్తోంది. ప్రధానంగా.. ఇటీవల కుక్కుమాంసంపై పెద్దయెత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా.. బెంగ‌ళూరులో కుక్క మాంసం ప్రచారం తీవ్ర కలకలం రేపింది. ఇంతకీ.. బెంగళూరులో కుక్కమాంసం ప్రచారంపై కర్నాటక ప్రభుత్వం ఏమంటోంది?.. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఏం చెప్తున్నారు?..

Dog Meat: మటన్‌ పేరుతో.. బెంగళూరుకు కుక్క మాంసం రవాణా.. నిజమేనా...
Mutton
Follow us on

బెంగళూరు కేఎస్‌ఆర్‌ రైల్వే స్టేషన్‌లో రెండు రోజులు క్రితం హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. రాజస్థాన్‌ నుంచి బెంగళూరుకు మటన్‌ పేరుతో కుక్కమాసం రవాణా చేస్తున్నారంటూ నిరసనకు దిగారు. రాజస్థాన్‌ నుంచి ట్రైన్లలో కుక్కమాంసం తెచ్చి.. బెంగళూరులోని ప్రముఖ హోటల్స్కు సప్లయ్ చేస్తున్నారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. దాంతో.. బెంగళూరు కుక్క మాంసం ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో కర్నాటక ఫుడ్ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్ అథారిటీ అధికారులు.. బెంగళూరు రైల్వేస్టేషన్‌లోని పార్శిల్‌ విభాగంలో తనిఖీలు నిర్వహించి పెద్దయెత్తున మాంసాన్ని సీజ్‌ చేశారు. అనుమానాస్పద మాంసం శాంపిల్స్‌ను ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌కు పంపారు.

వాస్తవానికి.. బెంగళూరులోని ప్రముఖ హోటల్స్కు సప్లయ్ చేసేందుకు రాజస్థాన్ నుంచి మటన్‌ తెప్పిస్తుంటారు కొందరు మాంసం వ్యాపారులు. ఈ క్రమంలోనే.. జైపూర్- మైసూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో అబ్దుల్ రజాక్ అనే మాంసం వ్యాపారి భారీగా మటన్‌ తీసుకురాగా కుక్కమాంసం ఆరోపణలతో అధికారులు సీజ్ చేశారు. అయితే.. అది మటనా?.. కుక్క మాంసమా? అనేది క్లారిటీ లేకుండా సోషల్ మీడియాలో వ్యవహారం సంచలనం సృష్టించింది. ఇదిలావుంటే.. బెంగళూరులోని మెజారిటీ మటన్ షాపుల్లో ప్రస్తుతం కిలో మటన్ 700 రూపాయలపైనే పలుకుతోంది. కానీ.. ట్రైన్లో దొరికిన మాంసం బాక్సుల వ్యాపారి అబ్దుల్ రజాక్తో పాటు మరికొందరు మాత్రం కిలో మటన్ను 400 రూపాయలకే అమ్ముతుండడం అనుమానాలకు తావిచ్చింది. మటన్ పేరుతో అబ్దుల్ రజాక్ కుక్క మాంసం అమ్ముతున్నారని బెంగళూరులోని పలువురు మాంసం వ్యాపారులు ఆరోపించడం వివాదానికి కారణమైంది.

ఇక.. కొందరు వ్యాపారుల చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు బాధితుడు అబ్దుల్‌ రజాక్‌. కొందరు కావాలనే వదంతులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలంటే చూసుకోండి.. అంటూ సీజ్‌ చేసే సమయంలో పార్శిల్‌ బాక్సుల్లోని మటన్‌ను తీసి చూపించే ప్రయత్నం చేశారు. మటన్ అమ్మకానికి సంబంధించి లైసెన్స్ కూడా తీసుకున్నానని, గుట్టుచప్పుడు వ్యాపారం చేయడం లేదని స్పష్టం చేశారు వ్యాపారి అబ్దుల్ రజాక్. ఏదేమైనా.. ఎవరి వర్షన్‌ ఎలా ఉన్నా.. కుక్కమాంసం ఆరోపణలతో బెంగళూరు హోటల్స్‌లో మటన్‌ తినేవాళ్లలో, తిన్న వాళ్లలో టెన్షన్‌ నెలకొంది. ఈ నేపథ్యంలో..ఆహార భద్రతా కమిషనరేట్ అధికారులు అది మేక మాంసం అని నిర్ధారించారు .

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..