Riddhi Thakkar: ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది.. గమ్యం చేరకుండానే ఇలా..

ఎన్నో కళలతో ప్రపంచాన్ని చుట్టేద్దామని బయల్దేరిన ఒక 24 ఏళ్ల యువతికి ఊహించని ప్రమాదం ఎదురైంది. 20 మంది బైకర్ల బృందంతో కలిసి ప్రయాణిస్తున్న ఆమెను మృత్యువు వెంటాడింది. ప్రారంభించిన ప్రయాణాన్ని ముగించకుండానే ఆమెను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. తోటి బైకర్లతో కలిసి ట్రిప్‌కు బయల్దేరిన మహారాష్ట్రకు చెందిన రిద్ధి ఠక్కర్ అనే 24 ఏళ్ల యువతి బుధవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందింది.

Riddhi Thakkar: ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది.. గమ్యం చేరకుండానే ఇలా..
Female Biker Riddhi Thakkar Dies During National Bike Trip

Updated on: Aug 13, 2026 | 8:22 AM

ఆమె ఎప్పుడూ అందరికంటే భిన్నంగా ఆలోచించేది. “ఈ జీవితం చాలా చిన్నది.. సమయం ఉన్నప్పుడే మనసుకు నచ్చింది చేయాలి” అనే మనస్తత్వం తనది. అదే ఆలోచనతో ముందడుగు వేసి, బైక్‌పై సరికొత్త ప్రపంచాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగింది. కానీ ఆమెను చూసి కాలం అసూయ పడినట్టుంది, ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేసింది. ఒక భారీ వాహనం ఆమె బైక్‌ను ఢీకొట్టి వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన రిద్ధి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని బోరివాలి వెస్ట్‌కు చెందిన రిద్ధి ఠక్కర్ ఇటీవలే తన బజాజ్ అవెంజర్ బైక్‌పై నేషనల్ ట్రిప్‌కు బయల్దేరింది. ఆమెతో పాటు మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 20 మంది బైకర్లు బృందంగా ఏర్పడి ప్రయాణం ప్రారంభించారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ వైపు ప్రయాణిస్తుండగా, బలోద్ సమీపంలో NH-30పై వెళ్తున్న ఒక గుర్తుతెలియని భారీ వాహనం రిద్ధి బైక్‌ను ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది.

వైద్యుల ప్రయత్నం నిష్ఫలం

ప్రమాదాన్ని గమనించిన తోటి రైడర్లు వెంటనే అప్రమత్తమై ‘డయల్ 112’కు సమాచారం అందించారు. మొదట ఆమెను చరమ (కాంకేర్ జిల్లా)లోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ధమ్తరిలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ రిద్ధి ప్రాణాలు విడిచింది. ఆమె మృతితో తోటి బైకర్ల బృందం కన్నీటి పర్యంతమైంది.

పోస్ట్‌ చూడండి..

పోలీసుల దర్యాప్తు

తోటి బైకర్ల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని, డ్రైవర్‌ను గుర్తించేందుకు సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

వాహనదారులకు హెచ్చరిక

ఎంతో ఉత్సాహంతో ప్రపంచాన్ని చుట్టేద్దామని బయల్దేరిన ఆమె ప్రయాణం గమ్యానికి చేరకుండానే ముగిసిపోవడం అత్యంత విచారకరం. తను అన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ, ఎవరో చేసిన పొరపాటు కారణంగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి రహదారులపై వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us