Viral: భార్యతో హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశాడు.. కట్ చేస్తే.. ఇంతలో జరగాల్సింది జరిగిపోయింది.!
ఆ యువకుడు పెళ్లి తర్వాత హనీమూన్ ట్రిప్ కోసం భారీగా ప్లాన్ చేసుకున్నాడు. అనుకున్నట్లుగానే మాంచి హిల్ స్టేషన్‌కు భార్యతో కలిసి వెళ్లాడు..
ఆ యువకుడు పెళ్లి తర్వాత హనీమూన్ ట్రిప్ కోసం భారీగా ప్లాన్ చేసుకున్నాడు. అనుకున్నట్లుగానే మాంచి హిల్ స్టేషన్‌కు భార్యతో కలిసి వెళ్లాడు. సీన్ కట్ చేస్తే.. వెళ్లిన తర్వాత రోజే అనుకోని సంఘటన జరిగి.. ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి అయిన కొద్దిరోజులకే నవ వరుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇంతకీ అసలేం జరిగింది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.?
వివరాల్లోకి వెళ్తే.. 23 ఏళ్ల ఇంతియాజ్ షేక్ తన భార్యతో కలిసి ముంబై సమీపంలోని మతేరన్ అనే ప్రాంతానికి హనీమూన్ ట్రిప్‌పై వెళ్లాడు. అక్కడ వారికి మరో జంట పరిచయం అయింది. దీంతో ఆ నలుగురు గుర్రపు స్వారీ చేయాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా తాము ఉంటున్న హోటల్ నుంచి గుర్రాలపై స్వారీ చేస్తూ కొంత దూరం వెళ్లారు. అయితే ఈలోపు ఇంతియాజ్ స్వారీ చేస్తోన్న గుర్రం మరింత వేగం పుంజుకుంది. అంతే! అతడు కాస్తా అదుపు తప్పి గుర్రంపై నుంచి జారి కిందపడ్డాడు. దీంతో తలకు బలమైన గాయం అయింది. వెంటనే ఇంతియాజ్‌ను హుటాహుటిన స్థానికంగా ఉన్న మతేరన్ మున్సిపల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి డాక్టర్లు మెరుగైన చికిత్స నిమిత్తం ఉల్హాస్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కానీ అప్పటికే షేక్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతడ్ని బ్రతికించేందుకు అంబులెన్స్‌లోని డాక్టర్ శతవిధాల ప్రయత్నించినా.. ఏమాత్రం ఉపయోగం లేకపోయింది. చికిత్స పొందుతూ ఇంతియాజ్ షేక్ తుదిశ్వాస విడిచాడు. కాగా, ఈ ఘటనపై మతేరన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గుర్రంపై నుంచి పడిపోవడానికి గల కారణం ఏంటన్న దానిపై విచారణ చేపట్టారు. ‘ప్రస్తుతం మృతుడి కుటుంబసభ్యులు మాట్లాడే పరిస్థితిలో లేరు. అంత్యక్రియల అనంతరం మరోసారి వారిని కలుస్తాం. అలాగే స్టేట్మెంట్ సైతం రికార్డు చేస్తాం. ఎవరి నిర్లక్ష్యంతో ఈ ఘటన జరిగిందో తెలుసుకుని వారికి శిక్ష పడేలా చేస్తామని’ మతేరన్ అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ శేఖర్ తెలిపారు.