ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. అయినప్పటికీ కొందరు ప్రజలు భూతవైద్యం,మూఢనమ్మకాలనే అనుసరిస్తున్నారు. మూఢ విశ్వాసాలకు పోయి ముక్కుపచ్చలారని చిన్నారులను మృత్యువుకు అప్పగిస్తున్నారు. దగ్గు తగ్గేందుకు రెండు నెలల చిన్నారిని ఇనుప రాడ్ వేడిచేసి కాల్చిన హృదయ విదారక సంఘటన గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో చోటుచేసుకుంది. పాపను ప్రభుత్వాసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు. వైద్యుల పరిశీలనలో శిశువు ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిసింది. చిన్నారికి వాతలు పెట్టిన నకిలీ వైద్యుడిపై, చిన్నారి తల్లిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ వైద్యుడిని అరెస్టు చేశారు.
వారం రోజుల నుంచి పాపకు దగ్గు, కఫంతో బాధపడుతోంది. దాంతో పాప తల్లిదండ్రులు ఇంటి వద్ద స్థానిక చికిత్స చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే నాటు వైద్యం చేసే దేవరాజ్ భాయ్ కటారా వద్దకు తీసుకెళ్లింది. వ్యాధిని నయం చేసేందుకు ఇనుప రాడ్ వేడి చేసి చిన్నారి ఛాతీపై, పొట్టపై కాల్చివాతలు పెట్టాడు సదరు నాటు వైద్యుడు. అయితే చిన్నారి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేకపోవడంతో తల్లి ఆమెను పోర్‌బందర్‌లోని జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ తర్వాత ఘటన గురించిన విషయం బయటి ప్రపంచానికి తెలిసింది.
మధ్యప్రదేశ్‌లో రెండు చోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. నిమోనియాతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి శరీరంపై ఇనుప కడ్డీతో కాల్చారు. ఇనుప రాడ్‌తో పొట్టపై 51 సార్లు పొడిచారు. దాంతో పాప పరిస్థితి విషమించింది. చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.
రెండున్నర నెలల పసికందు అనారోగ్యం నయం కావడానికి ఇనుప రాడ్డుతో 20 సార్లు కాల్చిన సంఘటన సైతం మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇక్కడ కూడా తీవ్ర గాయాలతో చిన్నారి మృతిచెందింది. మధ్యప్రదేశ్‌లోని గిరిజన సమూహాలలో విస్తృతంగా ఆచరించే మంత్రవిద్య చికిత్స పసిపిల్లలపై రుద్దుతున్నారు. ఇనుప రాడ్డుతో కాలిస్తే న్యుమోనియా పోతుందని వారి విశ్వాసం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..