Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. యూపీలోని లఖింపూర్‌లో మరో ఇద్దరు దళిత బాలికలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇద్దరు మైనర్ బాలికలు చెట్టుకు వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..బాలికల మృతదేహాలను కిందకు దింపారు..పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలు లభ్యమైన ప్రాంతంలో భారీ పోలీసు బలగాలు మోహరించాయి. సమాచారం అందుకున్న లఖింపూర్ ఖేరీ జిల్లా ఎస్పీ సంజీవ్ సుమన్, అదనపు ఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికల మృతికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉంటే.. మృతులు పూనమ్ (15), మనీషా (17)గా గుర్తించారు. మృతిచెందిన బాలికలిద్దరూ అక్కా చెల్లెలుగా తెలిసింది. సమీపంలోని గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బాలికలను అపహరించి చెట్టుకు ఉరివేసినట్లు మృతిచెందిన బాలికల తల్లి మాయా దేవి ఆరోపించింది. మృతదేహాలను శవపరీక్షకు తరలించారు. మృతికి గల కారణాన్ని నిర్ధారించేందుకు సంఘటన స్థలంలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు..మరోవైపు బాలికల మృతిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే పోలీసులు భారీగా మోహరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి