
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాలకు పిల్లలను తీసుకెళ్తున్న పడవ బోల్తా పడింది. బాగమతి నదిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. పడవలో 30 మందికి పైగా చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటన గైఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. భాగమతి నదిలోని భట్గామ మధుర్‌పట్టి పీపాల్ ఘాట్ నుంచి చిన్నారులు పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన తర్వాత స్థానిక డైవర్లు చిన్నారులను రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. నదిలో కొట్టుకు పోతున్న చాలా మంది పిల్లలను బయటకు తీశారు. అయినప్పటికీ చాలా మంది పిల్లలు నది ప్రవాహంలో కొట్టుకుని పోయారు.. ఆ చిన్నారుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన తర్వాత అక్కడ గందరగోళం నెలకొంది. భారీగా జనం గుమిగూడారు. నది ఒరవడి బలంగా ఉంది. దీంతో నదిలో కొట్టుకుని పోతున్న చిన్నారుల వద్దకు చేరుకోవడానికి డైవర్లు చాలా ఇబ్బంది పడ్డారు. పిల్లలను రక్షించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూనే కొంతమంది చిన్నారులను రక్షించారు. అంతేకాదు ఈ విషాద ఘటనలో మరొక విషాదం ఏమిటంటే.. నదిలోకొట్టుకు పోతున్న చిన్నారులను రక్షించేందుకు వెళ్లిన యువకుడు కూడా గల్లంతైనట్లు సమాచారం.
ఈ ఘటనతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఘటన జరిగిన గంట తర్వాత పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రెస్క్యూ టీం కూడా సమయానికి చేరుకోలేదని దీంతోనే నదిలో పడిన చిన్నారులు ఎక్కువమంది గల్లంతయ్యారని ప్రజలు వాపోతున్నారు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నదిపై బ్రిడ్జి నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నా తమ డిమాండ్ ను నేరవేర్చకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. బోటులో స్కూల్ స్టూడెంట్స్ తో పాటు కొందరు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం.
#WATCH | Boat carrying school children capsizes in Bagmati river in Beniabad area of Bihar’s Muzaffarpur pic.twitter.com/TlHEfvvGYy
— ANI (@ANI) September 14, 2023
పాఠశాలకు పిల్లలను తీసుకెళ్తున్న పడవ బోల్తా పడటంతో ప్రభుత్వ యంత్రాంగంలో కలకలం రేగింది. వాస్తవానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ ముజఫర్‌పూర్ లో పర్యటించాల్సి ఉంది. క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్నారు. సిఎం రావడానికి ముందే ఈ ప్రమాదం జరగడంతో పాలనా యంత్రాంగం నైరాశ్యంలో పడింది.
ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ తూర్పు సహరియార్ అక్తర్ మాట్లాడుతూ మధుర్‌పట్టి ఘాట్ సమీపంలో బోటు ప్రమాదం జరిగిందని తెలిపారు. పడవలో దాని సామర్థ్యం కంటే ఎక్కువ మంది పిల్లలు, మహిళలు ఎక్కడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత రక్షించిన కొంత మంది చిన్నారులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే పడవలో ఎంత మంది పిల్లలు ఉన్నారనేది .. ఎంత మంది మరణించారనే విషయం ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేమన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి