Electric Bike: కరోనా మహమ్మారి కారణంగా దాదాపు ఏడాది పాటు ఇబ్బందులకు గురయ్యారు. లాక్‌డౌన్ సమయంలో అన్ని రంగాలతో పాటు విద్యారంగం సైతం మూతపడ్డాయి. దీని వల్ల విద్యార్థులకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. అయితే విద్యాసంస్థలకు సుదీర్ఘకాలం పాటు సెలవులు లభించడంతో ఎక్కువ మంది విద్యార్థులు తమ స్నేహితులతో ఆడుకోవడం, కాలక్షేపం చేయడం, మొబైల్ గేమ్స్ లతో విలువైన సమయాన్ని వృధా చేసుకున్నారు.
అయితే 15 ఏళ్ల ఒక విద్యార్థి మాత్రం ఇతర విద్యార్థులకంటే భిన్నంగా సెలవుదినాన్ని పూర్తిగా ఉపయోగించుకుని అందరితో ప్రశ్నంసలు అందుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లా నిప్పాని తాలుకాకు చెందిన పదో తరగతి విద్యార్థి ప్రతామేషా సుతారా పాఠశాలలు మూతపడిన సమయంలో సృజనాత్మకంగా ఏదైనా చేయాలని ఆలోచించాడు. ఆలోచించడమే తరువాయి ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించాలని అనుకున్నాడు.
తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశాడు. తన కుమారుడి ఆలోచన పట్ల అతని తల్లిదండ్రులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. తమ కుమారుడికి అన్ని రకాలుగా మద్దతుగా నిలిచి ప్రోత్సాహం అందించారు. దీంతో ప్రతమేష సుతారా ఎలక్ట్రిక్‌బైక్‌ను తయారీకి ఉపయోగించే రకరకాల స్క్రాప్ వస్తువులను సేకరించడం మొదలు పెట్టాడు. అతడి తండ్రి ప్రకాశ్ సుతారా స్వతహాగా ఎలక్ట్రీషియన్ కావడంతో తన ఆవిష్కరణకు కలిసివచ్చింది. ఎలక్ట్రిక్ బైక్ తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను తన తండ్రి గ్యారేజ్ నుంచి సేకరించాడు. వీటితో పాడు లిడ్ యాసిడ్ 48 వోల్టేజ్ బ్యాటరీ, 48 వోల్టేజీ మోటారు, 750 వాట్ మోటారులను కొనుగోలు చేసి ఎలక్ట్రిక్ రీఛార్జిబుల్ బైక్‌ను రూపొందించాడు.
ఈ సందర్భంగా ప్రతామేషా సుతారా మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సమయంలో పాఠశాలలు మూతపడటంతో ఇంట్లో ఖాళీగా ఉన్నాను. ఈ సమయాన్ని వృధా చేయడం కంటే ఏదైనా తయారు చేయాలని అనుకున్నాను. నా శక్తిమేరకు ఎలక్ట్రిక్ బైక్ సరైందని అనుకున్నాను. ఇప్పుడున్న కాలంలో ఎలక్ట్రిక్ బైక్‌లకు మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ఎలక్ట్రిక్ బైక్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. అందు వల్ల తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేశాను. ఈ బైక్ తయారీకి ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్న నా తండ్రి ఎంతగానో సహకరించారు. ఆయన ప్రోత్సాహంతోనే ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించాను. మరి కొన్ని విషయాలను గూగుల్‌లో వెతికి తెలుసుకున్నాను. అని విద్యార్థి అన్నారు.
కాగా, బైక్ తయారీకి కేవలం రూ.25వేల మాత్రమే ఖర్చు చేశానని తెలిపాడు. మార్కెట్లో లభించే ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే ఇది చాలా చౌకగా లభిస్తుందని అన్నారు. ఈ బైక్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని గరిష్ట వేగం గటకు రూ.40 కిలోమీటర్లు ఉంటుంది. దీనిలో రివర్స్ గేర్ ఆప్షన్‌ను కూడా తయారు చేశానని అన్నారు. అయితే 15 ఏళ్లు ఉన్న పదో తరగతి విద్యార్థి కొత్త ఆలోచనతో ఎలక్ట్రిక్ బైక్ తయారు చేయడంపై ప్రశంసలు కురిపిస్తున్నాడు.
నూతన ఎలక్ట్రిక్ బైక్ తయారీపై కుమారుడిపై తండ్రి సంతోషం వ్యక్తం చేశాడు. నా కొడుకు కొత్తగా ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించడం పట్ల ఎంతో గర్వంగా ఉంది. నేను ఎలక్ట్రిషియన్ అయినప్పటికీ నాకు దాని మెకానిజం గురించి పెద్దగా తెలియదు. నా కుమారుడు గూగుల్‌లో పరిశోధన చేసి తనే స్వయంగా ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించాడు. ఏదో ఒక రోజు అతను పెద్ద ఆవిష్కరణ చేస్తాడని ఆశిస్తున్నా.. అని అన్నాడు.