Crime News: జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని హత్య చేసిన కేసులో నేరం రుజువు కావడంతో 15 మంది దోషులకు మరణ శిక్ష విధిస్తూ జార్ఖండ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జంషెడ్ పూర్ లోని ఘఘిద్ సెంట్రల్ జైలులో 2019లో రెండు గ్రూపుల మధ్య నెలకొన్న వివాదం ఘర్షణకు దారితీసింది. ఈఘర్షణలో ఓ ఖైదీ హత్యకు గురయ్యాడు. ఈకేసును విచారించిన జార్ఖండ్ లోని ఈస్ట్ సింగ్భుమ్ లోని అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రాజేంద్రకుమార్ సంచలన తీర్పును వెలువరించారు. హత్య, నేరానికి కుట్ర చేసిన కేసులో నేరం రుజువు కావడంతో 15 మందికి ఉరిశిక్ష విధించారు. అలాగే హత్య చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు రుజువు కావడంలో మరో ఏడుగురికి 10ఏళ్ల జైలు విధించారు. మరణ శిక్ష పడినవారిలో ఇద్దరు ఖైదీలు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. తప్పించుకున్న ఇద్దరిని పట్టుకుని తమ ఎదుట హాజరుపర్చాలని జార్ఖండ్ డీజీపీని కోర్టు ఆదేశించింది. దీంతో దోషుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
2019 జూన్ 25వ తేదీన జషెండ్ పూర్ లోని ఘఘిద్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో మనోజ్ కుమార్ సింగ్ తో పాటు మరో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మనోజ్ కుమార్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేరం చేశారనడానికి ఆధారాలు ఉన్నందున దోషులకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..