ఆలుగడ్డలు తింటే బద్ధకం పెరుగుతుందా..? సద్గురు కామెంట్స్ వెనుక అసలు నిజాలివే..
ఆధ్యాత్మిక గురువు సద్గురు బంగాళాదుంపలపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. బంగాళాదుంపలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయని, ముఖ్యంగా చదువుకునే పిల్లలు, ధ్యానం చేసేవాళ్లు వీటికి దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అసలు సద్గురు చెప్పిన మాటల వెనుక ఉన్న రహస్యం ఏంటి? దీనిపై వైద్యులు ఏమంటున్నారు? అనేది తెలుసుకుందాం..

మనం రోజూ తినే కూరగాయల్లో బంగాళాదుంప అత్యంత ప్రజాదరణ పొందింది. పొటాటో ఫ్రై అన్నా, చిప్స్ అన్నా పిల్లల నుండి పెద్దల వరకు లొట్టలేసుకుని తింటారు. అయితే ఇటీవల ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇన్స్టాగ్రామ్ రీల్‌లో బంగాళాదుంపలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. బంగాళాదుంపలు ఎక్కువగా తింటే శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయని, ముఖ్యంగా కొందరు వీటిని అస్సలు తినకూడదని సద్గురు హెచ్చరించారు.
అసలు సద్గురు ఏం చెప్పారు?
సద్గురు తన ఇన్స్టాగ్రామ్ రీల్‌లో యోగ విజ్ఞానం ఆధారంగా బంగాళాదుంపల ప్రభావం గురించి వివరించారు. ‘‘దుంప జాతికి చెందిన కూరగాయలను, ముఖ్యంగా బంగాళాదుంపలను ఎక్కువగా తినడం వల్ల బొడ్డు కింద భాగంలో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. అక్కడ గ్యాస్ చేరడం వల్ల.. బొడ్డు నుండి గొంతు వరకు ప్రవహించే ప్రాణశక్తి ప్రవాహానికి అంతరాయం కలుగుతుంది. దీనివల్ల శరీరంలోని చైతన్యం, చురుకుదనం గణనీయంగా పడిపోతాయి” అని సద్గురు తెలిపారు. గతంలో కూడా ఆయన కొన్ని యూట్యూబ్ వీడియోల్లో బంగాళాదుంపలు, టమాటాలు, వంకాయలను నెగటివ్ ప్రాణిక్ ఫుడ్స్‌గా అభివర్ణించారు. ఇవి శరీరం నుండి శక్తిని లాగేసుకుని, మనిషిని బద్ధకంగా మారుస్తాయని, నిద్రపోయే సమయాన్ని పెంచుతాయని సద్గురు వివరించారు.
సద్గురు ప్రకారం.. బంగాళాదుంపలను ఎవరు దూరం పెట్టాలి?
మెదడు చురుగ్గా పనిచేయాలన్నా, ఎక్కువ సమయం ఏకాగ్రతతో ఉండాలన్నా ఈ క్రింది వారు బంగాళాదుంపలను పరిమితంగా తినాలని లేదా పూర్తిగా మానేయాలని సద్గురు సూచించారు.
విద్యార్థులు: ఎక్కువ సమయం చదువుకోవడానికి మానసిక స్పష్టత, ఏకాగ్రత అవసరమయ్యే విద్యార్థులు బంగాళాదుంపలకు దూరంగా ఉండటం మంచిది.
ధ్యానం చేసేవారు: మెడిటేషన్ చేసేటప్పుడు అలర్ట్‌గా ఉండాలి. పొటాటోస్ వల్ల వచ్చే మగత, నిద్ర దీనికి ఆటంకం కలిగిస్తాయి.
కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ ఉన్నవారు: ఆర్థరైటిస్, కాళ్ల వాపులతో బాధపడేవారు బంగాళాదుంపలను అస్సలు తినకూడదు, ఇవి కీళ్ల సమస్యలను మరింత తీవ్రం చేస్తాయి.
వైద్య నిపుణులు ఏమంటున్నారు?
సద్గురు చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రముఖ ఐఎస్ఐసి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హెడ్ డాక్టర్ శుభం వత్స్య సైంటిఫిక్ కోణాన్ని వివరించారు. బంగాళాదుంపలు ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయనేది నిజమేనని ఆయన అంగీకరించారు.
జీర్ణక్రియలో ఇబ్బంది: బంగాళాదుంపల్లో ఉండే స్టార్చ్ కొందరిలో పూర్తిగా జీర్ణం కావడం కష్టం. జీర్ణం కాని స్టార్చ్ పేగుల్లో ఫెర్మెంటేషన్ చెంది విపరీతమైన గ్యాస్, కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది.
బద్ధకానికి, గ్యాస్‌కు లింక్ ఏంటి?: బంగాళాదుంపలు నేరుగా ఏకాగ్రతను తగ్గిస్తాయనడానికి స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ నిరంతరం గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరంతో బాధపడటం వల్ల రాత్రి పూట నిద్ర సరిగ్గా పట్టదు. దీనివల్ల మరుసటి రోజు విపరీతమైన అలసట, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటివి జరుగుతాయి.
ఫ్రైడ్ ఫుడ్స్ మరింత డేంజర్: బంగాళాదుంపలను ఉడికించి తినడం కంటే, వాటిని నూనెలో బాగా వేయించి తింటే గ్యాస్ సమస్యలు మరింత ఎక్కువవుతాయి.
బంగాళాదుంపలు తినడం పూర్తిగా బంద్ చేయాలా?
బంగాళాదుంపలు అందరికీ హానికరం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక పోషకభరితమైన ఆహారం. కాకపోతే తినే విధానంలో మార్పులు చేసుకోవాలి.
- బంగాళాదుంపలను అమితంగా కాకుండా లిమిట్‌గా డైట్‌లో చేర్చుకోవాలి.
- డీప్ ఫ్రై చేసిన చిప్స్, ఫ్రైలకు దూరంగా ఉండి.. ఉడికించిన లేదా బేక్ చేసిన పొటాటోలను తినడం మంచిది.
- రోజూ శారీరక శ్రమ చేసేవారికి దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ స్టూడెంట్స్, ఆర్థరైటిస్ రోగులు మాత్రం సద్గురు చెప్పినట్లు కాస్త దూరంగా ఉండటమే మంచిది.
