పిల్లలకు మొబైల్ చూపిస్తూ తినిపిస్తున్నారా? ముప్పు గుప్పిట్లో మీ చిన్నారులు ఉన్నట్లే..

నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చాలా మంది తమ సమయాన్ని మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. ఈ అలవాటు భోజనం సమయంలో కూడా కొనసాగుతోంది. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

పిల్లలకు మొబైల్ చూపిస్తూ తినిపిస్తున్నారా? ముప్పు గుప్పిట్లో మీ చిన్నారులు ఉన్నట్లే..
Mobile Phone While Eating

Updated on: Jul 01, 2026 | 9:13 PM

పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది తినేటప్పుడు సోషల్ మీడియా, వీడియోలు లేదా సందేశాలు చూస్తూ భోజనం చేస్తున్నారు. అయితే ఈ అలవాటు సాధారణంగా కనిపించినప్పటికీ, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం

భోజనం చేసేటప్పుడు మొబైల్ ఫోన్‌పై దృష్టి కేంద్రీకరించడం వల్ల ఆహారాన్ని సరిగా నమలడం జరగదు. దీంతో ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. జీర్ణక్రియ ప్రక్రియ కూడా దెబ్బతింటుంది.

అతిగా తినే ప్రమాదం

మొబైల్ లేదా టీవీ చూస్తూ తినేటప్పుడు ఎంత ఆహారం తీసుకుంటున్నామో మనకు తెలియదు. దీంతో అవసరానికి మించి తినే అవకాశం పెరుగుతుంది. ఇది క్రమంగా బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

పేగుల ఆరోగ్యానికి ముప్పు

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం ఆహారంపై పూర్తి శ్రద్ధ అవసరం. కానీ మొబైల్ వాడటం వల్ల పేగులు, మెదడు మధ్య ఉండే సహజ సమన్వయం దెబ్బతింటుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది.

పిల్లల్లో చెడు ఆహారపు అలవాట్లు

ఇటీవలి కాలంలో పిల్లలకు మొబైల్ ఫోన్ చూపిస్తూ తినిపించడం సాధారణమైంది. అయితే ఈ అలవాటు పిల్లల్లో సరైన ఆహార సంస్కృతిని దెబ్బతీస్తుంది. పోషకాహార లోపాలు, జీర్ణ సమస్యలు, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

మానసిక ఆరోగ్యంపై ప్రభావం

భోజనం అనేది కేవలం ఆకలి తీర్చుకునే ప్రక్రియ మాత్రమే కాదు, ఒక అనుభవం కూడా. కానీ మొబైల్ చూస్తూ తినడం వల్ల ఆహారాన్ని ఆస్వాదించే అవకాశం తగ్గిపోతుంది. అంతేకాకుండా ఒత్తిడి, ఆందోళన స్థాయిలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

బ్యాక్టీరియా, సూక్ష్మక్రిముల ప్రమాదం

మొబైల్ ఫోన్లపై అనేక రకాల బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఉంది. భోజనం చేసేటప్పుడు ఫోన్‌ను పదేపదే తాకడం వల్ల అవి చేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశించవచ్చు. ఇది పలు రకాల ఇన్ఫెక్షన్లు, ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.

భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఇవీ..

  • భోజనం సమయంలో మొబైల్ ఫోన్, టీవీ వంటి పరికరాలకు దూరంగా ఉండండి.
  • ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమిలి తినండి.
  • ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో భోజనం చేయండి.
  • కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని భోజనం చేసే అలవాటు పెంచుకోండి.
  • భోజనం చేసే సమయంలో పూర్తిగా ఆహారంపైనే దృష్టి కేంద్రీకరించండి.

మొబైల్ ఫోన్ ఉపయోగం నేటి జీవితంలో అవసరమైనదే అయినప్పటికీ, భోజనం సమయంలో దానికి దూరంగా ఉండటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జాగ్రత్తగా, శ్రద్ధగా భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

Follow Us