
ఈ నూనెలో కొన్ని పదార్థాలు ఉంటాయి. అవి కొందరి చర్మానికి పడవు. ఈ నూనె రాసినప్పుడు చర్మం దురద పెట్టడం, ఎర్రగా అవ్వడం, వేడిగా అనిపించడం వంటి ఇబ్బందులు రావచ్చు. సున్నితమైన చర్మం లేదా అలర్జీలు ఉన్నవారికి ఇది అంత మంచిది కాదు. కాబట్టి బాదం నూనె వాడేటప్పుడు మీ చర్మం రకం ఏంటో తెలుసుకోని వాడడం చాలా ముఖ్యం.
ఆయిలీ స్కిన్ ఉన్నవారికి బాదం నూనె సరిగ్గా సెట్ అవ్వదు. ఈ నూనె వాడిన తర్వాత మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ముఖం మీద నూనె ఉండటం వల్ల మురికి పేరుకుపోయి ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఆయిలీ చర్మం ఉన్నవారు ఈ నూనె వాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.
కొందరికి బాదం నూనెలోని పదార్థాలు పడవు, దీనివల్ల అలర్జీ వస్తుంది. అలర్జీ వస్తే ముఖం ఎర్రగా మారడం, దురదతో పాటు వాపు రావడం సాధారణంగా జరుగుతుంది. అలాంటప్పుడు వెంటనే నూనె వాడటం ఆపేయాలి. మొదట కొంచెం నూనెను చిన్న చోట రాసి పరీక్షించి చూడటం మంచిది.
బాదం నూనె వాడితే కొందరి ముఖంపై ఉండే సహజమైన మెరుపు తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. ముఖం కొంచెం జిడ్డుగా, బరువుగా అనిపించవచ్చు. ఇది ముఖం అందాన్ని తగ్గించి.. చర్మం చిరాకుగా కనిపించేలా చేస్తుంది. అందుకే ఈ నూనెను ముఖంపై ఎక్కువగా రాయకూడదు.
ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నూనె రాసుకొని బయటికి వెళ్తే చర్మం మీద మచ్చలు, రంగు మారడం వంటివి జరగవచ్చు. దీనివల్ల చర్మం వేరేలా కనిపిస్తుంది. ఈ సమస్య రాకుండా ఎండలో వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
బాదం నూనె చర్మానికి తేమను, మెరుపును ఇస్తుంది. కానీ అందరికీ ఇది సరిగ్గా పనిచేయకపోవచ్చు. మీ చర్మం రకానికి తగిన జాగ్రత్తలు తీసుకుని వాడితేనే బాదం నూనె మంచి ఫలితాలు ఇస్తుంది. ఎండ నుంచి రక్షణ తీసుకుంటూ తక్కువగా వాడితే మీ చర్మం ఆరోగ్యంగా మెరుస్తుంది.