
ఆహారం, నీరు, గాలి లాగే సరైన నిద్ర కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మంచి నిద్రతో పాటు, ఉదయం సరైన సమయంలో నిద్ర లేవడం కూడా శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యంత కీలకం. ఈ విషయంలో చాలామందికి ఉన్న అపోహలు, వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా పెద్దలు త్వరగా పడుకుని త్వరగా లేవాలని చెబుతుంటారు. ఈ నియమం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం 5 గంటలకు లేవడం అత్యుత్తమ సమయం. ఒకవేళ 5 గంటలకు సాధ్యం కాకపోతే ఉదయం 6 గంటలకు తప్పనిసరిగా లేవాలి. 5, 6 గంటల మధ్య సమయం మేల్కొనడానికి అత్యంత అనుకూలమైనదిగా చెబుతారు. ఈ సమయంలో వాతావరణం ప్రశాంతంగా, కాలుష్యం లేకుండా ఉంటుంది. త్వరగా లేవడం వల్ల శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుంది, ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.
ఉదయం 9, 10 గంటల తర్వాత నిద్ర లేచే వ్యక్తులు తరచుగా బద్ధకం, చిరాకు వంటి సమస్యలను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా లేవడం వల్ల ఏ పనిపైనా దృష్టి పెట్టలేకపోవడం, ప్రొడక్టివిటీ తగ్గడం జరుగుతుంది. అంతేకాకుండా ఉదయం లభించే సహజ సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలిని కోల్పోవడం వల్ల విటమిన్ డి లోపం, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. ఇది ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
శక్తి, మానసిక ఆరోగ్యం: ఉదయం త్వరగా లేవడం వల్ల శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుంది. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడంతో పాటు ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
మెరుగైన ఫలితాలు: రోజు కోసం మీ లక్ష్యాలను సాధించడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పనిలో మెరుగైన ఫలితాలు ఇస్తుంది.
శారీరక ఆరోగ్యం: త్వరగా లేవడం వల్ల శారీరక శ్రమకు సమయం దొరుకుతుంది. ఇది అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన మరియు ఉత్సాహభరితమైన జీవితం కోసం, ఉదయం త్వరగా నిద్ర లేవడాన్ని ఒక అలవాటుగా చేసుకోవడం మంచిది. ఇది మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..