Swimming: స్మిమ్మింగ్‌తో అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ చేస్తే ఆ సమస్యలన్నీ హాంఫట్
ఒక గంట పాటు ఈత కొడితే.. అది ఒక గంట పరిగెత్తినంతగా ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి సహాయపడుతుంది. విశేషమేమిటంటే స్విమ్మింగ్ కీళ్లపై కూడా దుష్ప్రభావం చూపదు.
Health benefits of swimming: ఎండలు దంచికొడుతున్నాయి. నానాటికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే.. వేడి నుంచి ఉపశమనం పొందడానికి, వ్యాయామం చేయడానికి ఈత కొట్టడం ఉత్తమమైన మార్గం అని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. స్విమ్మింగ్ అనేది కార్డియో వ్యాయామం. ఈ వ్యాయామం బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మీరు ఒక గంట పాటు ఈత కొడితే.. అది ఒక గంట పరిగెత్తినంతగా ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి సహాయపడుతుంది. విశేషమేమిటంటే స్విమ్మింగ్ కీళ్లపై కూడా దుష్ప్రభావం చూపదు. ఇది శరీరంలోని అన్ని కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది. అటువంటి పరిస్థితిలో వేసవిలో వ్యాయామం చేయడానికి ఈత మంచిది. ఇది కాకుండా ఈత వలన కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు చూడండి..
ఈత వల్ల కలిగే ప్రయోజనాలు
పూర్తి శరీర వ్యాయామం: స్విమ్మింగ్ అనేది పూర్తి శరీర వ్యాయామం. దీంతోపాటు ముఖ్యంగా కార్డియో వ్యాయామం. ఈత కొట్టేటప్పుడు మీ పాదాలు నిరంతరం కదులుతాయి. ఇది చేతులు, భుజాలకు కూడా బలాన్ని చేకూర్చి.. కండరాలను టోన్ చేస్తుంది. దీంతోపాటు శక్తిని కూడా పెంచుతుంది.
గుండె-రక్తపోటును నియంత్రిస్తుంది: స్విమ్మింగ్ శరీరాన్ని బయట నుంచి మాత్రమే కాకుండా లోపల నుంచి కూడా ఆరోగ్యవంతంగా మార్చే వ్యాయామం. స్విమ్మింగ్ గుండె, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈత కొట్టడం వల్ల రక్తపోటు తగ్గుతుందని, మధుమేహం కూడా అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
నొప్పి నుంచి ఉపశమనం: ఈత శరీరానికి విశ్రాంతిని ఇచ్చే వ్యాయామం. ఇది కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. కీళ్లనొప్పులు లేదా ఎముకలకు గాయం అయినప్పటికీ ఈత సురక్షితమని పేర్కొంటున్నారు. వేసవిలో స్విమ్మింగ్ పూల్ లోని గోరువెచ్చని నీటిలో ఉండడం వల్ల శరీర నొప్పులు దూరమవుతాయి.
ఊపిరితిత్తులకు బలం: ఈత ఊపిరితిత్తులను బలంగా చేస్తుంది. ఇది ఊపిరితిత్తులలో ఆక్సిజన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎక్కువ కాలం శ్వాసను బిగ పట్టుకునే సామర్థ్యం సైతం పెరుగుతుంది. ఆస్తమా రోగులకు కూడా ఈత చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు.
మంచి నిద్ర – ఒత్తిడి దూరం: ఈత కొట్టిన తర్వాత శరీరం బాగా అలసిపోతుంది. ఈత కొట్టడం వల్ల చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది. నీటిలో ఈత కొట్టిన తర్వాత ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. అందుకే స్విమ్మింగ్ చేస్తే మంచిగా నిద్ర పట్టడంతోపాటు ఒత్తిడి దూరమవుతుంది.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు, సూచనలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. వీటిని సూచనలుగా మాత్రమే తీసుకోండి. వీటిని అనుసరించే ముందు నిపుణులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..