ఒక కిలోమీటర్‌‌కు ఎన్ని అడుగులు.. బరువు తగ్గడానికి 10 వేల అడుగుల వెనుక ఉన్న అసలు లెక్కలివే..

ఆరోగ్యంగా ఉండాలంటే జిమ్‌కు వెళ్లి చెమట చిందించాల్సిన పనిలేదు.. వేలకు వేలు ఖర్చు చేసి డైట్ ప్లాన్స్ పాటించాల్సిన అవసరం లేదు. కేవలం మన కాళ్లకు పని చెబితే చాలు.. అవును, ప్రపంచంలోనే అత్యంత ఖరీదు లేని, అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం వాకింగ్. అయితే, మనం రోజూ ఎన్ని అడుగులు వేస్తున్నాం? ఒక కిలోమీటరు నడవడానికి సగటున ఎన్ని అడుగులు పడతాయి? అనేది తెలుసుకుందాం..

ఒక కిలోమీటర్‌‌కు ఎన్ని అడుగులు.. బరువు తగ్గడానికి 10 వేల అడుగుల వెనుక ఉన్న అసలు లెక్కలివే..
How Many Steps Make 1 Kilometer

Updated on: Jan 20, 2026 | 12:48 PM

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఊబకాయం, గుండె జబ్బులు సర్వసాధారణమైపోయాయి. బరువు తగ్గడానికి ఖరీదైన జిమ్‌లు, కఠినమైన వ్యాయామాల కంటే నడక మిన్న అని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పరుగుతో పోలిస్తే నడక వల్ల కీళ్లపై ఒత్తిడి పడకుండా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. చాలామంది నడకను అడుగుల్లో లెక్కిస్తుంటారు. అసలు ఒక కిలోమీటరు దూరం పూర్తి చేయడానికి సగటున ఎన్ని అడుగులు వేయాలి..? అనే సందేహం అందరికీ ఉంటుంది. ఒక కిలోమీటరుకు సగటున 1250 నుండి 1550 అడుగులు పడతాయి. ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి సగటున 1400 అడుగులు వేస్తాడని అంచనా.

అడుగుల లెక్క ఎందుకు మారుతుంది?

ప్రతి వ్యక్తి వేసే అడుగుల సంఖ్య ఒకేలా ఉండదు. ఇది ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎత్తు ఎక్కువగా ఉన్నవారి కాళ్లు పొడవుగా ఉండటం వల్ల వారు తక్కువ అడుగుల్లోనే ఎక్కువ దూరం ప్రయాణిస్తారు. మీరు నెమ్మదిగా నడిచినప్పుడు అడుగులు ఎక్కువగా పడతాయి, అదే వేగంగా నడిచినప్పుడు అడుగుల దూరం పెరుగుతుంది. పురుషులు, మహిళల శరీర నిర్మాణం, నడక శైలి బట్టి అడుగుల సంఖ్యలో వ్యత్యాసం ఉంటుంది.

10,000 అడుగుల మ్యాజిక్ నంబర్

ప్రపంచవ్యాప్తంగా ఫిట్‌నెస్ నిపుణులు సూచించే లక్ష్యం రోజుకు 10,000 అడుగులు. మీరు 10,000 అడుగులు నడిస్తే సుమారు 7 నుండి 8 కిలోమీటర్ల దూరం పూర్తి చేసినట్లు లెక్క. దీనివల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది. ఒకేసారి అంత దూరం నడవలేకపోతే, కనీసం 5,000 అడుగులతో ప్రారంభించి క్రమంగా పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నడక వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు

  • రక్త ప్రసరణ మెరుగుపడి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.
  • అధిక రక్తపోటు సమస్యను అదుపులో ఉంచుతుంది.
  • పరుగుతో పోలిస్తే నడక వల్ల మోకాళ్లపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అందుకే ఇది వృద్ధులకు కూడా శ్రేష్ఠం.
  • నడక వల్ల ఒత్తిడి తగ్గి, మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

మీరు బరువు తగ్గాలనుకున్నా లేదా ఆరోగ్యంగా ఉండాలనుకున్నా.. ఖరీదైన పరికరాలు లేకున్నా కేవలం ఒక జత షూ వేసుకుని నడకను ప్రారంభించడం ద్వారా మీ జీవితంలో గొప్ప మార్పును చూడవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..