Vanjangi in Visakha: విశాఖ జిల్లా అంటేనే ప్రకృతి అందాలకు పెట్టింది పేరు..మన్యం ప్రాంతాలైన పాడేరు, వంజంగి హిల్స్‌లో అబ్బుర పరిచే రమణీయ దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో భారీ స్థాయిలో పర్యాటకులు పాడేరు ఏజెన్సీకి పోటెత్తుతున్నారు. ప్రతిరోజూ సూర్యోదయం కాగానే కళ్ళ ముందు సాక్షాత్కరించే మంచు దుప్పటి, చేతికి అందేంత దూరంలో తేలియాడే మబ్బులు, చుట్టుపక్కల ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. వంజంగి కొండల పైనుంచి సూర్యోదయాన్ని చూసేందుకు పర్యాటకులు బారులు తీరుతున్నారు. శని,ఆది వారాలకు తోడు సంక్రాంతి శెలవులు కలిసి రావడంతో చిన్నా, పెద్దతో పాటు అధిక సంఖ్యలో యువత ఛలో పాడేరు అంటున్నారు.
వంజంగి హిల్స్ తో పాటు సముద్ర మట్టానికి 4,500 అడుగుల ఎత్తున ఉన్న బోలెంగమ్మ పర్వత శిఖరం ప్రకృతి ప్రియులకు స్వర్గధామంగా మారింది. మారుమూల ఏజెన్సీలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఏడాది వ్యవధిలో రెండు లక్షల మంది పర్యాటకులు సందర్శించి వెళ్లినట్టు అధికారులు చెబుతున్నారు. శీతకాలం వచ్చిందంటే చాలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గిరిజన పల్లెలకు వంజంగి హిల్స్ పర్యాటక కేంద్రంగా గిరిజనులకు జీవనోపాధి సైతం కల్పిస్తోంది.
Read Also:
ఏపీలో కరోనా నిబంధనలు మరింత కఠినం.. మాస్క్ లేని వారిని అనుమతిస్తే.. షాప్ యజమానికి భారీగా ఫైన్