Araku Valley tourism : ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు లోయలో నేటి నుంచి సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. ఈ నెలాఖరు వరకు పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. కొవిడ్ కేసుల ఉధృతి నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు పెట్టారు. హోటళ్లు, లాడ్జి యజమానులకు ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. చిలకల గెడ్డ నుంచి చాపరాయి వరకు ప్రత్యేక అదనపు బలగాలతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. 10 మొబైల్ టీమ్స్ తో వారం రోజుల పాటు విసృత తనిఖీలు చేపట్టనున్నారు. కొవిడ్ నేపధ్యంలో పర్యాటకులు సహకరించాని కోరారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇలా ఉండగా, కరోనాను కట్టడి చేయడంలో భాగంగా ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ ఈ నెలాఖరు దాకా రాష్ట్ర ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, ‘ఈ నెల 20వ తేదీ నుంచి ఏపీలో లాక్ డౌన్ సమయాల్లో మార్పులు జరిగాయని.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని’ ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లను ఏపీ ప్రభుత్వం ఖండించిన సంగతి తెలిసిందే.
కర్ఫ్యూ సమయాల్లో ఎలాంటి మార్పులు జరగలేదని.. గతంలో మాదిరిగానే మధ్యాహ్నం 12 గంటల నుంచి తర్వాతి రోజు 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతుందని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చీఫ్ సెక్రటరీ హెచ్చరికలు కూడా జారీ చేశారు.