
తలనొప్పి సర్వసాధారణమైన సమస్య. మనలో చాలా మంది కచ్చితంగా ఈ సమ్యను ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే ఉంటారు. అయితే సర్వసాధారణమైన తలనొప్పి కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అయితే మనకు వచ్చే తల నొప్పుల్లో చాలా రకాలున్నాయని మీకు తెలుసా.? ఇంతకీ ఏ రకమైన తలనొప్పిని ఎలాంటి లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
* ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ప్రజలు చాలా బిజీగా మారిపోయారు. వృత్తి మొదలు వ్యక్తిగత జీవితం వరకు ఒత్తిడితో చిత్తవుతున్నారు. దీంతో తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఒత్తిడి కారణంగా కూడా తలనొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* తలనొప్పికి మరో కారణం మైగ్రేన్. ఈ సమస్యబారిన పడిన వారిలో విపరీతమైన తలనొప్పి వేధిస్తుంటుంది. ఏదైనా కాంతి పడినప్పుడు లేదా శబ్ధం, కొన్ని రకాల వాసనల వల్ల తలనొప్పి ప్రారంభమవుతుంది.
* కంటి చికాకుతో వచ్చే తలనొప్పిని క్లస్టర్ తలనొప్పిగా చెబుతుంటారు. ఇది చాలా తీవ్రమైన తలనొప్పిని కలిగిస్తుంది. కళ్లు ఎర్రగా మారి, కంటి నుంచి నీళ్లు వస్తాయి.
* చాలా మంది ఎదుర్కొనే తల నొప్పుల్లో సైనస్ కారణంగా వచ్చే తలనొప్పి కూడా ఒకటి. ముక్కులో ఏర్పడే సమస్య కారణంగా తలనొప్పికి దారి తీస్తుంది. ముక్కు కారడంతో పాటు తలనొప్పి ఉంటే అది సైనస్ కారణంగా వచ్చిందని భావించాలి.
* ఇక రాత్రి మద్యం ఎక్కువగా సేవించిన వారికి ఉదయం పూట వచ్చే తలనొప్పిని హ్యాంగోవర్ తలనొప్పిగా పిలుస్తుంటారు. సాధారణంగా మద్యం సేవించినప్పుడు శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీంతో వీపరీతమైన తలనొప్పి వేధిస్తుంటుంది.
* కంటప్యూటర్లు, స్మార్ట్ ఫోన్‌లు వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా ఉపయోగించే వారికి కూడా తల నొప్పి వేధిస్తుంటుంది. ఇలాంటి వారు కళ్ల జోళ్లను ఉపయోగించడం వల్ల ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..