ప్రస్తుతం జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు. కానీ ప్రస్తుతం మానసిక శ్రమ పెరుగుతోంది. గంటల తరబడి ఒకేచోట కూర్చొని చేసే పనులు పెరిగిపోతున్నాయి. డెస్క్ పనులు ఎక్కువవుతున్నాయి. రోజుకు 9 నుంచి 11 గంటల వరకు ఒకే చోట కూర్చుని పనిచేస్తున్నారు. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. తాజాగా డెస్క్ పనుల వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతందన్న అంశంపై పరిశోధకులు చేపట్టిన అధ్యయనాల్లో భయంకర విషయాలు వెల్లడయ్యాయి.
ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల మీ మరణ ప్రమాదాన్ని 16 శాతం పెంచుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. JAMA నెట్‌వర్క్ ఓపెన్ జర్నల్‌లో ఈ విసయాలను ప్రచురించారు. సుమారు 13 సంవత్సరాలలో 4,81,688 మంది వ్యక్తులపై నిర్వహించిన ఈ అధ్యయనంలో వివరాలు వెల్లడయ్యాయి. ఎక్కువసేపు కుర్చీల్లో కూర్చున్న వ్యక్తులు హృదయ సంబంధ వ్యాధుల కారణంగా త్వరగా మరణించే ప్రమాదం 34 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బీపీ, షుగర్, ఊబకాయం, కొలెస్ట్రాల్, మెటబాలిక్ సిండ్రోమ్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఒకవేళ ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువసేపు కూర్చుంటే.. ఊబకాయం, స్మోకింగ్ వల్ల కలిగే మరణానికిసమానమైన ప్రమాదం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం రోజుకు కనీసం 22 నిమిషాల శారీరక శ్రమ చేయడం వల్ల ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించవచ్చని తేలింది. అలాగే.. అధ్యయనం ప్రకారం, వారానికి 150 నిమిషాల శారీరక శ్రమ లేదా చురుకైన నడవడం, వ్యాయామం చేయడం, తోటపని చేయడం లేదా కొండ ఎక్కడం వంటి పనుల వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..