ఉరుకులు పరుగులు జీవితంలో ఎప్పుడూ ఏదొక టెన్షన్ పడుతుంటాం. అలాంటప్పుడు తరచూ గుండె సంబంధిత రోగాలు రావడం సహజం. ఇటీవల కాలంలో చాలా తక్కువ వయసున్నవారు గుండెపోటుకు గురవుతున్నారు. గణాంకాల ప్రకారం.. భారతదేశంలో ప్రతి 4 మరణాలలో ఒకరు హృదయ సంబంధిత వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు. 80 శాతం కేసులకు గుండెపోటే కారణం. ఆశ్చర్యకరంగా 40 నుంచి 55 ఏళ్ల వ్యక్తులే ఎక్కువ మంది ఉంటున్నారు.
ఇదిలా ఉంటే గుండె జబ్బులు రావడానికి వివిధ కారణాలు ఉండొచ్చు. ఇక అందులో ఒక రీజన్ మన రక్త నాళల్లో అధికంగా కొలెస్ట్రాల్ పేరుకుపోవడం.. దీని వల్ల గుండెకు రక్తం సరిగ్గా సరఫరా కాకపోవడంతో హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి. ఇలా రాకుండా ఉండటానికి డాక్టర్లు పలు సూచనలు ఇస్తుంటారు. కొన్ని డైట్‌లను ఫాలో కావాలని సలహాలు కూడా ఇస్తారు. మరి గుండెకు మేలు చేసే 5 ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
వేరుశెనగను గుండెకు ఎంతో మంచిది. మంచి కొవ్వును కలిగి ఉన్న వేరుశెనగలో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. అవి గుండె భేషుగ్గా ఉండటానికి సహకరిస్తాయి. అలాగే వేరుశెనగలో ఉండే ఖనిజాలు గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడతాయి.
నారింజలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. పొటాషియం అధికంగా ఉండే నారింజలో ఎలక్ట్రోలైట్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అటు విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లు కూడా గుండె జబ్బులను నివారించడంలో తోడ్పడతాయి.
ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన ఓట్స్.. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఓట్స్‌లో ఒమేగా 3 ఆమ్లాలు కూడా ఉన్నాయి, ఇవి గుండెకు చాలా ప్రయోజనకరం. ప్రతీ రోజూ ఓట్స్ తినడం వల్ల మీ గుండె ఆరోగ్యకరంగా ఉంటుంది.
ప్రతిరోజూ అరకప్పు వాల్‌నట్స్‌ను తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టొచ్చు. అలాగే గుండె ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే వాల్‌నట్స్ హృదయ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అలాగే గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
అవోకాడోలో విటమిన్-ఈతో పాటు అనేక ఇతర పోషకాలు ఉన్నాయి. మోనో అన్-శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఈ పండు గుండెకు చాలా మంచిది. దీనిని రోజూ తినడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.. అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండెపోటుతో సహా గుండె సంబంధిత వ్యాధులు నుంచి బయటపడవచ్చు.