
మన మెదడును సరైన మార్గంలో ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత బలంగా మారుతుంది. కానీ, మారుతున్న జీవనశైలి అలవాట్లు మన జ్ఞాపకశక్తిని, ఆలోచనా నైపుణ్యాలను నెమ్మదిగా బలహీనపరుస్తాయి. మనలో చాలా మంది మెదడుకు హానికలిగించే పనులను మనకు తెలియకుండానే అలవాటు చేసుకుంటున్నాం. అందుకే చాలా మందిలో ఏకాగ్రత నిలపలేక ఇబ్బంది పడటం. లేదా మానసికంగా అలసిపోయినట్లు అనిపించడం, ఏదీ గుర్తుండకపోవడం వంటి సమస్యలకు ఈ అలవాట్లే కారణం కావచ్చు. మన జ్ఞాపకశక్తిని దెబ్బతీసే 6 రోజువారీ అలవాట్లు ఇవి.. వాటిని ఎలా పరిష్కరించాలో తెలుసుకుందాం…
కొంతమంది మల్టీ టాస్కర్లుగా పిలిపించుకోవడానికి ఎంతో గర్వంగా ఫీలవుతుంటారు. కానీ, ఈ అలవాటు మీకుంటే ఇప్పుడే మానేయండి. ఒకే సారి ఎక్కువ పనులు చేయడం వల్ల మెదడుపై మరింత ఎక్కువ భారం పడుతుంది అని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇలా మల్టీటాస్కింగ్ చేసేటప్పుడు మన మెదడు ఒకేసారి ఎక్కువ విషయాలమీద ఫోకస్ నిలవపలేక ఇబ్బంది పడుతుంటుంది. ఇది మతిమరుపునకు దారితీస్తుంది. దీనికి బదులుగా ఒకేసారి ఒకే పనిపై ధ్యాస పెట్టి మెదడుకు కాస్త విశ్రాంతినివ్వండి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్త ప్రవాహం పెరుగుతుంది. అది సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి సంబంధిత పరిస్థితుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ప్రతిరోజూ 30 నిమిషాల నడక లేదా కొన్ని స్ట్రెచింగ్ వ్యాయామాలు కూడా మీ మెదడు శక్తిని పెంచుతాయి. మీ జ్ఞాపకశక్తిని పదునుగా ఉంచుతాయి.
పజిల్స్, చిక్కు ప్రశ్నలు లేదా సమస్య పరిష్కారం కనుగొనడం వంటి పనులు మెదడుకు మేత వంటివి. మెదడును సవాలు చేసే అవకాశం కల్పించకపోతే అది సోమరిగా మారిపోతుంది. వ్యాయామం లేకుంటే కండరాలు బలహీనపడినట్లే, క్రమం తప్పకుండా మెదడు కూడా దానికి సరైన పనిలేకుంటే మీ జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. సుడోకు ఆడటం, క్రాస్‌వర్డ్‌ను పరిష్కరించడం లేదా కొత్త అభిరుచిని ప్రయత్నించడం కూడా మీ మెదడును నిమగ్నమై ఉంచుతుంది.
ప్రతి చిన్న విషయానికి మీ ఫోన్‌పై ఆధారపడటం వల్ల మీ మెదడు మందగిస్తుంది. నిరంతరం సమాచారం రావడం వల్ల మీ మనస్సు ఓవర్‌లోడ్ అవుతుంది, ముఖ్యమైన వివరాలపై దృష్టి పెట్టడం, గుర్తుకు తెచ్చుకోవడం కష్టమవుతుంది. అలాగే, స్క్రీన్‌లను ఎక్కువసేపు చూడటం వల్ల లోతైన ఆలోచన తగ్గుతుంది. మెదడు సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యం బలహీనపడుతుంది. అందుకే ఫోన్ పక్కనపెట్టి బుర్రకు పనిపెట్టండి.
ఒంటరితనం వల్ల మీ మెదడు పనిచేయడం ఆపేస్తుంది. ఆలోచనలను పంచుకోవడం, ప్రియమైనవారితో సమయం గడపడం ఆలోచనా నైపుణ్యాలను పదును పెట్టడం వంటివి జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. మరోవైపు, మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోవడం వల్ల మానసిక సమస్యలొస్తాయి. ఒత్తిడి, నిరాశకు కూడా ఇది దారితీస్తుంది. మీ మెదడును చురుకుగా ఉంచడానికి స్నేహితులతో కనెక్ట్ అవ్వడం, సామాజిక సమూహాలలో చేరడం లేదా సరదా చర్చల్లో పాల్గొనడం అలవాటు చేసుకోండి.