
ప్రపంచం ఎంత వేగంగా దూసుకుపోతున్నా, సాంకేతికంగా మనం ఎంత ఎదిగినా.. ఇప్పటికీ కొందరి విషయంలో కాలం ఆగిపోయిందేమో అనిపిస్తుంది. బయటకి గంభీరంగా కనిపిస్తూ, గుండె నిండా బాధ్యతల బరువును మోస్తూ, కన్నీటిని కళ్ళలోనే దాచుకునే ఆ వ్యక్తి ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అవును, మనం మాట్లాడుకుంటున్నది ఇంటికి ఆధారం, కష్టాలకు ఎదురు నిలిచే ఒక ‘పురుషుడు’ గురించి. కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ, మగాళ్ల మానసిక స్థితిపై జరుగుతున్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
చిన్నప్పటి నుంచి అబ్బాయిలకు నేర్పించే మొదటి పాఠం ‘మగాడు ఏడవకూడదు’. ఈ ఒక్క మాట వారి చుట్టూ ఒక ఇనుప గోడను నిర్మిస్తోంది. ఫలితంగా, టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా అనేకమంది పురుషులు తమ సమస్యలను బయటకు చెప్పుకోవడానికి వెనకాడుతున్నారు. ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు వెరసి వారిని ఒక నిశ్శబ్ద పోరాటంలోకి నెట్టేస్తున్నాయి. సమాజం వేసే ప్రశ్నలకు భయపడి, బలహీనతను బయటపెడితే ఎక్కడ చులకన అయిపోతామో అనే ఆందోళన వారిని మానసిక కుంగుబాటుకు గురి చేస్తోంది.
ప్రస్తుత కాలంలో ‘హస్టిల్ కల్చర్’ పెరిగిపోయింది. రాత్రింబవళ్లు కష్టపడితేనే గుర్తింపు లభిస్తుందన్న భ్రమలో పురుషులు తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. డేటా ప్రకారం, భారతదేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుషుల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. కేవలం ఆర్థిక కారణాలే కాకుండా, భావోద్వేగాలను పంచుకునే వారు లేకపోవడం, ఒంటరితనం వారిని ఈ తీవ్ర నిర్ణయాల వైపు నడిపిస్తున్నాయి.
మగాడు అంటే కేవలం డబ్బు సంపాదించే యంత్రం కాదు, అతడికి కూడా భావోద్వేగాలు ఉంటాయని గుర్తించడం ఈ ఏడాది మనం చేయాల్సిన మొదటి పని.
కొత్త సంవత్సరంలో అయినా ‘మగాడు అంటే మొండివాడు’ అన్న పాత చింతకాయ పచ్చడి సామెతలను పక్కన పెట్టి, ‘మగాడు అంటే మనిషి’ అని గుర్తిద్దాం. భావోద్వేగాలను పంచుకోవడం వల్ల పురుషత్వం తగ్గిపోదు, పైగా అది మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది. సమాజం ఇచ్చే ట్యాగుల కంటే మనశ్శాంతి ముఖ్యం అని గ్రహించినప్పుడే ఈ 2025 మగాళ్లకు నిజమైన వరం అవుతుంది.