AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాకి సాధారణ పక్షి కాదు.. దాని గురించి ఆసక్తికరమైన విషయం తెలుసుకుని సైంటిస్టులు షాక్..

మనం రోజూ చూసే కాకులను చాలా సాధారణమైనవిగా భావిస్తాం. కానీ శాస్త్రీయంగా చూస్తే, వీటి తెలివితేటలు అమోఘం. కేవలం ఆహారం కోసం పోట్లాడటమే కాకుండా, సమస్యలను పరిష్కరించడంలో, పనిముట్లను వాడటంలో ఇవి ఆరితేరిపోయాయి. కాకుల జ్ఞాపకశక్తి మరియు సామాజిక స్పృహ గురించి పరిశోధకులు వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసుకుందాం..

కాకి సాధారణ పక్షి కాదు.. దాని గురించి ఆసక్తికరమైన విషయం తెలుసుకుని సైంటిస్టులు షాక్..
Intelligent Crows.jpg
Nikhil
|

Updated on: Mar 12, 2026 | 6:50 AM

Share

కాకి అనగానే మనకు గుర్తొచ్చేది దాని నలుపు రంగు, కర్కశమైన అరుపు. కానీ, మన ఇంటి ముందు వాలి అన్నం పెట్టమని అరిచే ఈ పక్షి వెనుక ఒక అద్భుతమైన తెలివితేటల ప్రపంచం దాగి ఉందని మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనల ప్రకారం, కాకులు భూమిపై ఉన్న అత్యంత తెలివైన జీవులలో ఒకటిగా గుర్తించబడ్డాయి. వీటి మెదడు సామర్థ్యం కేవలం పక్షులకే పరిమితం కాకుండా, కొన్ని సందర్భాల్లో కోతులకు, చింపాంజీలకు కూడా సవాలు విసురుతుంటాయి.

గుర్తుంచుకోవడంలో దిట్ట..

కాకులకు ఉన్న అత్యంత ఆశ్చర్యకరమైన లక్షణం ఏంటంటే, అవి మనుషుల ముఖాలను చాలా కాలం పాటు గుర్తుంచుకోగలవు. వాషింగ్టన్ యూనివర్శిటీలో జరిగిన ఒక పరిశోధన ప్రకారం, తమకు హాని చేసిన వ్యక్తి ముఖాన్ని కాకులు ఏళ్ల తరబడి మర్చిపోవు. అంతేకాదు, ఆ వ్యక్తి మళ్ళీ కనిపిస్తే అవి పెద్దగా అరుస్తూ హెచ్చరిస్తాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, ఆ వ్యక్తి గురించి తన గుంపులోని ఇతర కాకులకు కూడా సమాచారాన్ని అందిస్తాయి. దీనివల్ల ఆ వ్యక్తిని చూడగానే మిగిలిన కాకులు కూడా శత్రువుగా పరిగణించి అప్రమత్తం అవుతాయి.

ఆహారాన్ని సంపాదించుకోవడానికి కాకులు కేవలం తమ ముక్కుపైనే ఆధారపడవు. సన్నని పుల్లలను, తీగలను వాడుతూ రంధ్రాల్లో ఉన్న పురుగులను లేదా ఆహారాన్ని బయటకు తీయడం వాటి మేధస్సుకు నిదర్శనం. ప్రకృతిలో దొరికే వస్తువులను ఒక ‘పనిముట్టు’గా మలచుకోవడం అనేది చాలా తక్కువ జీవుల్లో కనిపించే లక్షణం. అవసరమైతే ఆ పుల్లలను వంచి హుక్ లాగా మార్చుకుని మరీ ఆహారాన్ని వేటాడతాయి.

సామాజిక స్పృహ..

కాకులు చాలా సామాజికమైనవి. తన గుంపులో ఏదైనా కాకి చనిపోతే, మిగిలిన కాకులన్నీ అక్కడికి చేరుకుంటాయి. దీనిని మనం ‘కాకి గోల’ అనుకుంటాం కానీ, అది వాటి ఒక రకమైన ‘విచారణ’. ఆ కాకి ఎలా చనిపోయింది? అక్కడ ఏదైనా ప్రమాదం ఉందా? అని అవి విశ్లేషిస్తాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో మనుషులు లేదా జంతువుల నుండి ముప్పు ఉంటే మిగిలినవి జాగ్రత్త పడతాయి. “కాకికి ఉన్నంత లోకజ్ఞానం మనిషికి ఉండాలి” అని పెద్దలు ఊరికే అనలేదు. చిన్న మెదడు ఉన్నప్పటికీ, ఆలోచనా శక్తిలో కాకులు మేటి అని నిరూపించుకుంటున్నాయి. వచ్చేసారి మీ ఇంటి ముందు కాకి వాలినప్పుడు, అది మిమ్మల్ని గమనిస్తోందని.. మీ ముఖాన్ని తన జ్ఞాపకాలలో దాచుకుంటోందని గుర్తుంచుకోండి!

Follow Us