
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి, శక్తిని పెంచుకోవడానికి చాలామంది ధ్యానం వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ధ్యానం ఎల్లప్పుడూ ప్రశాంతతనే ఇస్తుందా? అంటే.. కాదు అని చెబుతున్నారు మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ మనస్తత్వవేత్త నికోలస్ వాన్ డామ్. ఆయన నేతృత్వంలో జరిగిన తాజా పరిశోధన ధ్యానం వల్ల కలిగే అవాంఛిత దుష్ప్రభావాలను వెలుగులోకి తెచ్చింది. చాలామందికి ధ్యానం సానుకూల ఫలితాలను ఇస్తున్నప్పటికీ కొందరిలో ఇది విపరీతమైన భయాందోళనలు, పాత గాయాలకు సంబంధించిన బాధాకరమైన జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. మరికొందరిలో వ్యక్తిత్వం కోల్పోవడం లేదా ప్రపంచం నుంచి తాము వేరుపడినట్లుగా భావించే వింత అనుభూతులు కలుగుతున్నాయని ఈ అధ్యయనం తేల్చింది.
వాన్ డామ్ బృందం అమెరికాలోని దాదాపు 900 మంది ధ్యానం చేసే వ్యక్తులపై ఈ పరిశోధన నిర్వహించింది. కేవలం సానుకూల అంశాలనే కాకుండా, ప్రతికూలతలను కూడా గుర్తించడానికి 30 అంశాల చెక్‌లిస్ట్‌ను ఉపయోగించారు. 60శాతం మంది కనీసం ఒక దుష్ప్రభావాన్ని ఎదుర్కొన్నారు. 30శాతం మంది ధ్యానం వల్ల సవాలుతో కూడిన లేదా బాధాకరమైన అనుభూతులను పొందారు. 9శాతం మంది ఈ ప్రభావాల వల్ల తమ దైనందిన పనుల్లో ఆటంకాలు కలిగినట్లు నివేదించారు.
ఈ అధ్యయనం ప్రకారం.. ధ్యానం ప్రారంభించడానికి ముందే మానసిక క్షోభ లేదా ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో ప్రతికూల ప్రభావాలు కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఎక్కువ రోజులు నిశ్శబ్దంగా గడిపే రెసిడెన్షియల్ రిట్రీట్స్‌కు వెళ్లే వారిలో కూడా ఈ దుష్ప్రభావాలు ఎక్కువగా కనిపించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
తమ పరిశోధన ఉద్దేశం ప్రజలను ధ్యానం చేయవద్దని భయపెట్టడం కాదు.. కానీ నష్టాల గురించి వారికి ముందే తెలియజేయడమని వాన్ డామ్ వివరించారు. శస్త్రచికిత్సకు ముందు వైద్యులు రిస్క్ గురించి ఎలా వివరిస్తారో, ధ్యానం నేర్పించేటప్పుడు కూడా మైండ్‌ఫుల్‌నెస్ వల్ల కలిగే అసౌకర్యాల గురించి ముందే చెప్పాలని ఆయన సూచిస్తున్నారు.
అసౌకర్యం సహజమే: ధ్యానంలో అప్పుడప్పుడు కలిగే అసౌకర్యం లోతైన మానసిక విశ్లేషణలో భాగం కావచ్చు.
వృత్తిపరమైన సలహా: తీవ్రమైన ఆందోళన లేదా పనితీరు దెబ్బతినేంత బాధ కలిగినప్పుడు వెంటనే నిపుణులైన మెంటార్లను లేదా మానసిక వైద్యులను సంప్రదించాలి.
సమాచారంతో కూడిన ప్రాక్టీస్: ధ్యానం వల్ల ఏం ఆశించాలో, ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో ముందే తెలుసుకోవడం మంచిది.
ధ్యానం అనేది మానసిక ఆరోగ్యానికి ఒక గొప్ప మార్గం. అయితే దాన్ని ఒక చికిత్సగా తీసుకున్నప్పుడు శాస్త్రీయ దృక్పథంతో ముందస్తు అవగాహనతో ముందడుగు వేయడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..