
నీతి కథలు మనిషి జీవితానికి విలువైన పాఠాలను అందస్తాయి. ఇవి వినోదంతో పాటు విద్యను కూడా అందిస్తాయి. సమయస్ఫూర్తి, తెలివితేటలతో జీవితంలో ఎదురయ్యే ప్రమాదాలను కూడా జయించవచ్చని నీతి కథలతో పిల్లలకు అర్థమయ్యేలా వివరిచేందుకు అవకాశముంటుంది. శారీరక బలం కంటే బుద్ధి బలమే గొప్పది.. ఎంతటి బలవంతుడినైనా సరే సమయస్ఫూర్తి, తెలివితేటలతో ఓడించవచ్చని వివరించే ఓ నీతి కథను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కథలో ఓ తెలివైన కుందేలు.. ఉపాయంతో అపాయాన్ని ఎలా తప్పించుకుందో గుండెలను హత్తుకునేలా వివరించడం జరిగింది.
అనగనగా ఒక అడవిలో ఒక బలమైన సింహం ఉండేది. అది ప్రతిరోజూ ఇతర జంతువులను వేటాడి చంపుతూ అడవిలో భయానక వాతావరణాన్ని సృష్టించేది. దాంతో ఆ అడవిలోని జంతువులు అన్ని భయంతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చివరకు జంతువులన్నీ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. సింహంతో ఒక ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించాయి. ప్రతిరోజూ ఒక జంతువు స్వయంగా సింహానికి ఆహారంగా వెళ్తుందని, దాంతో వేటాడడం ఆపాలని సింహాన్ని కోరాయి. సింహం ఈ ఒప్పందాన్ని అంగీకరించింది. కానీ ఒక షరతు పెట్టింది..ఏ రోజైనా ఆహారం ఆలస్యమైతే మొత్తం అడవిని నాశనం చేస్తానని హెచ్చరించింది.
రోజూ ఒక జంతువు సింహానికి ఆహారంగా వెళ్తున్నాయి. రోజులు సాఫీగా సాగుతున్నాయి. ఒకరోజు ఒక తెలివైన కుందేలు వంతు వచ్చింది. చనిపోవడం ఇష్టం లేని ఆ కుందేలు ఒక చక్కని ఉపాయం ఆలోచించింది. అది కావాలనే ఆలస్యంగా సింహం దగ్గరకు బయలుదేరింది.
సింహం ఆకలితో, కోపంతో ఎదురుచూస్తుండగా కుందేలు దాని గుహ వద్దకు చేరుకుంది. ఆలస్యానికి కోపంతో ఉన్న సింహం దాన్ని తినాలని సిద్ధమైంది. కానీ కుందేలు వినయంగా మాట్లాడుతూ..తన రాక ఆలస్యం కావడానికి కారణాన్ని ఇలా వివరించింది.. దారిలో మరో పెద్ద సింహం తనను అడ్డుకుందని చెప్పింది. అది తానే అడవికి రాజు అని చెప్పి, సింహాన్ని సవాల్ చేసిందని చెప్పింది.
ఈ మాట విన్న సింహానికి అహంకారం పెరిగింది. ఈ అడవికి నేనే రాజును అంటూ కోపంతో ఊగిపోతూ ఆ సింహాన్ని వెతికేందుకు కుందేలును వెంట తీసుకుంది. కుందేలు దాన్ని ఒక లోతైన పాడుబడిన బావి దగ్గరకు తీసుకెళ్లింది. అడవికి తానే రాజు అని చెప్పిన ఆ సింహం.. ఈ బావిలోనే ఉంది అని చెప్పింది. బావి లోపలకి తొంగి చూసిన సింహానికి తన నీడ కనిపించింది. అది మరో సింహమని భావించి కోపంతో గర్జించింది. బావిలో ప్రతిధ్వని తిరిగి రావడంతో మరింత కోపం పెరిగింది. అహంకారంతో నిండిన సింహం ఆ నీడ సింహాన్ని చంపేందుకు బావిలోకి దూకింది. కానీ అది లోతైన బావి కావడంతో మునిగి అక్కడికక్కడే మరణించింది.
ఈ విధంగా తెలివైన కుందేలు తన తెలివితేటలు, సమయస్ఫూర్తితో మొత్తం అడవిలోని జంతువులకు సింహం బారి నుంచి విముక్తి కలిగించింది. సింహం పీడ విరగడ కావడంతో అప్పటి నుంచి అడవిలో శాంతి నెలకొంది.
శారీరక బలం కంటే బుద్ధిబలం గొప్పది. ఉపాయంతో ఏ పెద్ద ప్రమాదాన్నైనా జయించవచ్చు.