నోరు ఆరోగ్యంగా లేకపోతే శరీరం మొత్తం బలహీనపడుతుంది. ఎందుకంటే ఏమి మాట్లడలేం.. ఏది తినలేం.. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అటువంటి సమయంలో నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. చిగుళ్ల వాపు, చిగుళ్ల నొప్పి, బ్రష్ చేసుకున్నప్పుడు చిగుళ్ల నుంచి రక్తం రావడం వంటి సమస్యలు మీరు గుర్తించినప్పుడు తక్షణమే అప్రమత్తం కావాలి. కాకపోతే కొన్ని స్వీయ జాగ్రత్తలు పాటించడం ద్వారా నోటి చిగుళ్ల సమస్యలను అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మీ జీవన శైలి, అలవాట్లు మీ నోటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయన్న విషయాన్ని గుర్తించాలని చెబుతున్నారు.
మీరు రోజు బ్రష్ చేస్తున్నప్పుడు పంటి చిగుళ్ల నుంచి రక్త రావడం మీరు గమనించారా? మీరు చల్లని ఐస్ క్రీమ్ లేదా.. వేడి వేడి కాఫీ టీ వంటివి తీసుకుంటున్నప్పుడు పన్ను పోటు పెడుతోందా? మీరు చిగుళ్ల వాపు కారణంగా మనస్పూర్తిగా నవ్వలేకపోతున్నారా? అయితే వెంటనే మీరు అప్రమత్తం కావాలి. మీ నోటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. ఆరోగ్యంగా ఉండే చిగుళ్లు పింక్ కలర్ లో పళ్లకు పట్టి ఉండి అందంగా కనిపిస్తాయి. అయితే మీ జీవన శైలి, అలవాట్లు, మీరు తీసుకొనే ఆహారం, మీ వయసు, నోటి విషయంలో మీరు తీసుకొనే జాగ్రత్తలు దీనిపై ప్రభావం చూపుతాయి. మరి మీ చిగుళ్ల ఆరోగ్యంగా లేవని ఎలా తెలుస్తుంది? మీ చిగుళ్లు సెన్నిటివ్అయినా, వాపు వచ్చినా.. బ్రష్ చేస్తున్నప్పుడు రక్తం వస్తున్నా.. ఎరుపు రంగులోకి మారినా వెంటనే అప్రమత్తం కావాలి.
మీ దంతాలను సరిగ్గా బ్రష్ చేయండి. ఆరోగ్యకరమైన నోరు, చిగుళ్ళు కలిగి ఉండటానికి బ్రష్ చేయడం కీలకం. మీడియం-సాఫ్ట్ టూత్ బ్రష్‌ని ఉపయోగించి రోజుకు కనీసం రెండుసార్లు మీ దంతాలను బ్రష్ చేసుకోవాలి. ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌ను ఉపయోగించండి. తరచుగా మీ టూట్ బ్రష్ మార్చండి..
రోజూ ఫ్లాస్ చేయండి.. బ్రషింగ్‌తో పాటుగా దంతాలను క్రమం తప్పకుండా ఫ్లాసింగ్ చేయాల్సిందే. దంతాల సందులలో టూత్ బ్రష్ చేరుకోలేదు. అయితే ప్లాసింగ్ చేయడం వలన ఇరుకైన ఖాళీలలో కూడా దంతాలు శుభ్రపడతాయి. ముఖ్యంగా మాంసాహారం వంటివి తిన్నప్పుడు దంతాలలో ఇరుక్కుంటాయి ఇవి కుళ్లిపోయినపుడు నోటి నుంచి దుర్వాసన వస్తుంది, మీ దంతాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి మీ దంతాలు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కనీసం రోజుకు ఒక్కసారైనా ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు ఫ్లాస్ చేయండి. 18-20 అంగుళాల పొడవు గల ఫ్లాస్ తీగను ఉపయోగించాలని సిఫార్సు చేస్తున్నారు.
దూమపానానికి గుడ్ బై చెప్పాల్సిందే.. ధూమపానం, పాన్, గుట్కా మొదలైన ఇతర పొగాకు ఉత్పత్తులు చిగుళ్ల వ్యాధికి దారితీస్తాయి. పొగాకు రక్త ప్రవాహాన్ని కూడా పరిమితం చేస్తుంది. ఇది గాయాన్ని త్వరగా నయం చేయడం కష్టతరం చేస్తుంది. మీరు చిగుళ్లలో రక్తస్రావంతో బాధపడుతున్నట్లయితే, వెంటనే ధూమపానం మానేయ్యాల్సిందే.
ఆహారంపై శ్రద్ధ.. మనం ఏ ఆహారం తీసుకున్నా అది మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అందరికీ తెలిసిందే. చక్కెర శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల వల్ల దంతాలలో పుచ్చు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన కూరగాయలు, ప్రోటీన్లు మీ నోటి ఆరోగ్యానికి మంచివి. మీ ఆహారంలో విటమిన్లు, ఖనిజాలను చేర్చడం కూడా మీ నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
రెగ్యూలర్ డెంటల్ చెకప్స్.. దంత పరీక్షలలో నోటిని శుభ్రపరచడం ఉంటుంది. దంతాల నుండి టార్టార్ తొలగించడానికి మీ దంతాలను ప్రొఫెషనల్ చేత శుభ్రపరచడం ఉత్తమ మార్గం. ప్రొఫెషనల్ క్లీనింగ్ సాధారణ టూత్ బ్రషింగ్ ద్వారా తొలగించలేని వాటిని తొలగించడానికి సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..