Success Story: ప్రమాదంలో కాళ్ళు, చేయి కోల్పోయాడు.. UPSC క్రాక్ చేసిన సూరజ్ .. నేటి తరానికి స్పూర్తి..

ఎగసి పడే అల కాదు నా జీవితం.. పడి ఎగసే అల నాకు ఆదర్శం అని కొంతమంది తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొంటూ తమ జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఆ లక్ష్యాన్ని సాధించే సమయంలో ఎదురయ్యే అడ్డంకులకు భయపడకుండా.. కృషి, పట్టుదలతో ప్రయత్నం చేస్తారు. అలాంటి వ్యక్తులు నేటి తరానికి స్పూర్తి.. ఈ రోజు ఒక ప్రమాదంలో తన రెండు కాళ్లు, ఒక చేయి కోల్పోయి.. పట్టుదలతో UPSCలో ఉత్తీర్ణత సాధించిన సూరజ్ తివారీ గురించి తెలుసుకుందాం..

Success Story: ప్రమాదంలో కాళ్ళు, చేయి కోల్పోయాడు.. UPSC క్రాక్ చేసిన సూరజ్ .. నేటి తరానికి స్పూర్తి..
Suraj Tiwari Ias

Updated on: Jul 30, 2025 | 3:14 PM

జీవితంలో కష్టాలు వస్తే.. ఆ కష్టాలను అధిగమించేందుకు మార్గాలు కూడా ఉంటాయి. పగలు వెంటే రాత్రి వస్తుంది.. జీవితం సుఖ దుఃఖాల కలయిక అని తెలిసిందే. అయితే వీటిని అందరూ విన్నా.. సూరజ్ తివారీ వంటి కొంత మంది మాత్రమే తమ జీవితానికి అన్వయించుకుంటారు. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన సూరజ్ తివారీ ధైర్యం, సంకల్పం గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోవాల్సిందే. అతను ఒక ప్రమాదంలో చేతులు, కాళ్ళు కోల్పోయాడు. కానీ అతని ధైర్యం గెలిచింది. వీల్ చైర్ పై కూర్చుని.. ఎటువంటి కోచింగ్ లేకుండా..కేవలం మూడు వేళ్లతో UPSC వంటి కష్టమైన పరీక్షని రాశి.. ఉత్తీర్ణత సాధించి చరిత్ర సృష్టించి ఐఏఎస్ ఆఫీసర్ గా విధులను నిర్వహిస్తున్న సూరజ్ జీవితం, విజయగాథ చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్య చేసుకునే ప్రతి ఒక్కరికీ ప్రేరణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

సూరజ్ తివారీ మెయిన్‌పురి జిల్లా కురవాలి తహసీల్‌లోని మొహల్లా ఘర్నాజ్‌పూర్ నివాసి. సూరజ్ తండ్రి రాజేష్ తివారీ టైలర్‌గా పనిచేస్తున్నాడు. సూరజ్ నగరంలోని మహర్షి పరశురామ్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. స్థానికంగానే 2011 సంవత్సరంలో పదవ తరగతి 2014లో ఇంటర్ ఉత్తీర్ణుడు అయ్యారు.

సూరజ్ జీవితాన్ని మార్చేసిన ప్రమాదం
మీడియా నివేదికల ప్రకారం జనవరి 24న సూరజ్ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు దాద్రీలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో, అతను రెండు కాళ్ళు, కుడి చేయి, ఎడమ చేతిలోని రెండు వేళ్లను కోల్పోయారు. ఒక సాధారణ వ్యక్తి నుంచి కుర్చీకి పరిమితం అయ్యే స్టేజ్ కి చేరుకున్నారు. ఇటువంటి పరిస్థితిలో సూరజ్ దైర్యాన్ని వదులుకోలేదు. తన జీవితానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. అదే పోరాట మార్గం. ఈ ప్రమాదం తర్వాత అతను నాలుగు నెలలు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత దాదాపు మూడు నెలలు బెడ్ రెస్ట్‌లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘోర ప్రమాదం తర్వాత సూరజ్ ఆత్మస్థైర్యాన్ని ఎక్కడా పోగొట్టుకోలేదు. చదువే తన జీవితాన్ని మారుస్తుందని నిర్ణయించుకున్నారు. దీంతో 2018 సంవత్సరంలో అతను JNU ఢిల్లీలో BA లో అడ్మిషన్ తీసుకున్నారు. 2021 సంవత్సరంలో BA ఉత్తీర్ణుడయ్యారు. తర్వాత MA లో అడ్మిషన్ తీసుకున్నారు. ఇంట్లో ఉంటూనే సొంతంగా చదువుకునే వారు. తనని తాను నమ్ముకున్నారు. ప్రమాదంలో కాళ్ళు పోగొట్టుకున్నా దైర్యాన్ని కాదు అని అనుకున్నారు. తన కలలకు రెక్కలు ఇవ్వాలనే మక్కువతో UPSC రాయాలని నిర్ణయించుకున్నారు.

సూరజ్ తివారీ 2022 సంవత్సరంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్షకి కూర్చున్నారు. మొదటి ప్రయత్నంలోనే ఈ కష్టమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అది కూడా 971వ ర్యాంక్ తో ఉత్తీర్ణత సాధించారు. సూరజ్ UPSC పరీక్ష కోసం ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. సొంతంగా చదువుకున్నారు.

ఇంటర్వ్యూ గురించి సూరజ్ ఏమి చెప్పాడంటే
UPSC పరీక్ష సమయంలో ఇంటర్వ్యూ చేస్తున్న ఒక అధికారి..తనని అడిగిన ప్రశ్నని గుర్తు చేసుకున్నారు. నేను ఒక ప్రత్యేక వర్గం నుంచి వచ్చాను.. కనుక రానున్న రోజుల్లో నీ లాంటి ప్రజల కోసం ఏదైనా పథకం రూపొందించాలనుకుంటావా అని అధికారి అడిగినట్లు సూరజ్ చెప్పారు. అధికారి అడిగిన ప్రశ్నకు నేను ఏ ప్రత్యేక వర్గం నుంచి రాలేదు.. మీలాగే ప్రతి పనిని నేను చేయగలనను అని చెప్పినట్లు సూరజ్ ఒక ఇంటర్యూలో చెప్పారు. తన సమాధానం విన్న తర్వాత ప్యానెల్‌లో ఉన్న అధికారులు సూరజ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..