కారులో ఏసీ ఆన్ చేసి నిద్రపోతున్నారా? అయితే, మీరు సైలెంట్ కిల్లర్ బారిన పడినట్లే!
సుదీర్ఘ ప్రయాణాలు (Long Drives) చేసేటప్పుడు అలసటగా అనిపిస్తే కారును రోడ్డు పక్కన ఆపి, ఏసీ ఆన్ చేసుకుని కాసేపు నిద్రపోవడం చాలామందికి అలవాటు. ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లేదా రాత్రి వేళల్లో డ్రైవర్లు ఈ పని చేస్తుంటారు. కానీ, ఇలా పార్క్ చేసిన కారులో ఏసీ ఆన్ చేసి కిటికీలు పూర్తిగా మూసేసి నిద్రపోవడం ప్రాణాలకే ముప్పని మీకు తెలుసా? ఈ అలవాటు కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్‌కు దారితీసి మరణానికి కారణమవుతుంది. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

ఏసీ ఆన్‌లో ఉన్న కారులో నిద్రపోతే మరణం సంభవించవచ్చా..? రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటన ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. నివేదికల ప్రకారం, 37 ఏళ్ల వ్యక్తి తన కారులో ఏసీ ఆన్‌లో ఉండగానే నిద్రపోయాడు. ఏసీ చాలా సేపటి వరకు ఆన్‌లోనే ఉంది. కారులో ఇంధనం అయిపోవడంతో ఏసీని ఆపేశారు. కానీ, ఆ వ్యక్తి మేల్కొనలేదు. పగటిపూట పార్క్ చేసిన కారులో ఎలాంటి కదలికలు లేకపోవడంతో, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ప్రజలు చెక్ చేయగా, ఆ వ్యక్తి కారు సీటులో విగతజీవిగా కనిపించాడు. ఈ సంఘటన, ఏసీ ఆన్‌లో ఉన్న కారులో నిద్రపోవడం మరణానికి దారితీస్తుందా అనే ప్రశ్నలను లేవనెత్తింది. దీనికి కారణం ఏమై ఉండవచ్చు?
అసలు ప్రమాదం ఎలా జరుగుతుంది?:
కారు కదులుతున్నప్పుడు ఎగ్జాస్ట్ పొగ వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ, కారు ఒకే చోట నిలిచి ఉన్నప్పుడు, ఇంజన్ రన్ అవుతుంటే దాని నుండి వెలువడే విషవాయువులు కారు చుట్టూ పేరుకుపోతాయి. కారు ఏసీ సిస్టమ్ లేదా కింద ఉండే చిన్న చిన్న లీకుల ద్వారా ఈ కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ క్యాబిన్ లోపలికి ప్రవేశిస్తుంది. కిటికీలు పూర్తిగా మూసి ఉండటం వల్ల లోపల ఉన్న ఆక్సిజన్ శాతం వేగంగా పడిపోయి, ఆ స్థానంలో విషవాయువు నిండిపోతుంది.
సైలెంట్ కిల్లర్ అని ఎందుకు అంటారు?:
కార్బన్ మోనాక్సైడ్ (CO) వాయువుకు ఎటువంటి రంగు గానీ, వాసన గానీ ఉండవు. కాబట్టి కారు లోపల విషపూరిత గాలి నిండుతున్నా పక్కన ఉన్నవారికి అస్సలు తెలియదు. ఒకవేళ మనిషి మేల్కొని ఉంటే తలనొప్పి, కళ్లు తిరగడం, కంగారు వంటి లక్షణాల ద్వారా ప్రమాదాన్ని గుర్తించి బయటకు రావచ్చు. కానీ, నిద్రపోతున్నప్పుడు లేదా ఆల్కహాల్ మత్తులో ఉన్నప్పుడు శరీరం స్పందించదు. ఈ గ్యాస్ రక్తంలోని హిమోగ్లోబిన్‌తో కలిసి ఆక్సిజన్ సరఫరాను పూర్తిగా నిలిపివేస్తుంది. దీనివల్ల నిద్రలోనే ఊపిరాడక ప్రాణాలు కోల్పోతారు.
ఏసీ పాడైతే మరింత ప్రమాదం:
కారు ఏసీ పాతదైనా లేదా సరిగ్గా సర్వీసింగ్ చేయించకపోయినా ఈ ముప్పు మరింత పెరుగుతుంది. మెకానిజంలో లోపాల వల్ల లోపలి గాలి సరిగ్గా ఫిల్టర్ అవ్వదు మరియు బయటి విషవాయువులు సులభంగా లోపలికి వచ్చేస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
కారులో నిద్రపోవద్దు: ప్రయాణాల్లో అలసటగా ఉంటే కారు దిగి హోటల్ లేదా సురక్షితమైన ప్రదేశంలో విశ్రాంతి తీసుకోండి. కారులో నిద్రపోవడాన్ని పూర్తిగా నివారించండి.
కిటికీలు కొద్దిగా తెరవండి: ఒకవేళ అత్యవసర పరిస్థితిలో కారులోనే ఆగాల్సి వస్తే, ఏసీ ఆన్ చేసినా కిటికీల గ్లాసులను కనీసం ఒక అంగుళం మేర కిందికి దించి ఉంచండి. దీనివల్ల బయటి గాలి లోపలికి వచ్చి ఆక్సిజన్ అందుతుంది.
రెగ్యులర్ సర్వీసింగ్: మీ కారు ఎగ్జాస్ట్ సిస్టమ్, ఏసీ ఫిల్టర్లను ఏడాదికి ఒకసారైనా ఖచ్చితంగా తనిఖీ చేయించండి.




