అస్సలు నీరసం రాకుండా బలాన్నిచ్చే సూపర్‌ఫుడ్.. ఇలా చేస్తే నిమిషాల్లోనే టేస్టీ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్..

ఉదయాన్నే శక్తివంతంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సగ్గుబియ్యం, పల్లీలు, బంగాళదుంపతో తయారుచేసే ఈ క్రిస్పీ టిఫిన్ రుచితో పాటు శక్తిని అందిస్తుంది. గుంత పొంగనాల పాన్‌లో లేదా సాధారణ పాన్‌లో సులభంగా తయారుచేసుకునే ఈ సగ్గుబియ్యం రెసిపీని ఇంట్లో తప్పక ప్రయత్నించండి.

అస్సలు నీరసం రాకుండా బలాన్నిచ్చే సూపర్‌ఫుడ్.. ఇలా చేస్తే నిమిషాల్లోనే టేస్టీ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్..
Saggubiyyam Breakfast

Updated on: Aug 23, 2026 | 8:18 PM

ఉదయాన్నే లేచినప్పటి నుంచి ఉరుకులు పరుగుల జీవితం.. ఎన్నో సమస్యలు.. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఉదయాన్నే ఆరోగ్యకరమైన టిఫిన్ తినరు.. ఏవేవో తింటూ పనులు చేసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుంది.. శరీరంలో శక్తి తగ్గుతుంది.. అందుకే.. ఉదయాన్నే ఫస్ట్ ఫుడ్ (బ్రేక్ ఫాస్ట్) ఆరోగ్యవంతమైనది తీసుకోవాలని సూచిస్తున్నారు డైటీషియన్లు.. మీరు కూడా అస్సలు నీరసం రాకుండా శక్తిని అందించే, ఆరోగ్యకరమైన, రుచికరమైన అల్పాహారం కోసం చూస్తుంటే.. సగ్గుబియ్యంతో తయారుచేసే ఈ ప్రత్యేకమైన రెసిపీ మీకు సరైన ఎంపిక.. కార్బోహైడ్రేట్లు, కాల్షియం వంటి పోషకాలతో నిండిన సగ్గుబియ్యం మీ దినచర్యకు కావాల్సిన బలాన్ని అందిస్తుంది. ఈ వంటకాన్ని కేవలం తక్కువ సమయంలోనే సిద్ధం చేసుకోవచ్చు. ఇది ఉదయం టిఫిన్‌గా లేదా సాయంత్రం వేళ స్నాక్‌గా కుటుంబసభ్యులందరినీ ఆకట్టుకుంటుంది.. దీన్ని తింటే.. ఎన్నో పోషకాలు శరీరానికి చేకూరుతాయి..

కావాల్సిన పదార్థాలు:

  • సగ్గుబియ్యం – 1 కప్పు
  • పల్లీలు – 1-2 టేబుల్‌స్పూన్లు
  • బంగాళదుంప – 1 మీడియం సైజు (పచ్చిది)
  • వెల్లుల్లి రెబ్బలు – 5-6
  • అల్లం – చిన్న ముక్క
  • పచ్చిమిరపకాయలు – 2-3
  • కొత్తిమీర – 1 కప్పు
  • జీలకర్ర – అర టీస్పూన్
  • బియ్యప్పిండి – 2-3 టీస్పూన్లు (లేదా బొంబాయి రవ్వ)
  • ఉప్పు – రుచికి సరిపడా
  • నూనె – వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

సగ్గుబియ్యం నానబెట్టడం: ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుని, ఒకటి రెండు సార్లు రబ్ చేస్తూ శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల వాటిపై ఉండే డస్ట్ లేదా పిండి తొలగిపోతుంది. ఆ తర్వాత, సగ్గుబియ్యం తీసుకున్న అదే కప్పుతో సమానంగా ఒక కప్పు నీటిని కలిపి గంట నుండి గంటన్నర సేపు నానబెట్టాలి. ఇలా సమానమైన నీటిని ఉపయోగించడం వల్ల నానిన తర్వాత నీళ్లు వంపే అవసరం ఉండదు. రాత్రి నానబెట్టి ఉదయం అల్పాహారానికి లేదా లంచ్ తర్వాత నానబెట్టి సాయంత్రం స్నాక్‌కు ఉపయోగించవచ్చు. నానిన సగ్గుబియ్యం నీటిని పూర్తిగా పీల్చుకుని మృదువుగా తయారవుతుంది.

పల్లీల పొడి తయారీ: ఒక పాన్‌లో ఒకటి రెండు టేబుల్‌స్పూన్ల పల్లీలను తీసుకుని, మీడియం మంటపై మూడు నాలుగు నిమిషాలు దోరగా వేయించాలి. వేగిన పల్లీలను ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారాక మిక్సీ గిన్నెలోకి మార్చాలి. పల్లీల పొట్టు తీసినా, తీయకపోయినా పర్వాలేదు. మరీ మెత్తగా కాకుండా, పల్లీ పలుకులు కనిపించేలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కావాలంటే రోట్లో దంచినా సరిపోతుంది.

గ్రీన్ పేస్ట్ తయారీ: అదే మిక్సీ గిన్నెలోకి పొట్టు తీసిన ఐదారు వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, రెండు మూడు పచ్చిమిరపకాయలు, ఒక కప్పు కొత్తిమీర ఆకు, అర టీస్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్లు కలపకుండా మెత్తగా రుబ్బాలి. మధ్యమధ్యలో కలుపుతూ రుబ్బడం వల్ల పేస్ట్ బాగా తయారవుతుంది.

పిండి కలపడం: నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులోకి ఒక మీడియం సైజు పచ్చి బంగాళదుంపను పీల్ చేసి, సన్నగా గ్రేట్ చేసి కలపాలి. ఉడికించిన బంగాళదుంపనైనా వాడవచ్చు. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పల్లీల పొడి, గ్రీన్ పేస్ట్, అలాగే టిఫిన్ క్రిస్పీగా రావడానికి రెండు మూడు టీస్పూన్ల బియ్యప్పిండి (లేదా బొంబాయి రవ్వ) వేసి బాగా కలపాలి. పిండి ముద్దలా రావడానికి అవసరమైతే మరికొంత బియ్యప్పిండి కలపవచ్చు.

వంటకం తయారీ (రెండు పద్ధతులు):

గుంత పొంగనాల పాన్‌లో: కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. గుంత పొంగనాల పాన్‌లో కొద్దిగా నూనె వేసి, అన్ని గుంతల్లోనూ నూనె స్ప్రెడ్ అయ్యేలా చూడాలి. ఆ తర్వాత తయారుచేసిన ఉండలను గుంతల్లో పెట్టి, మీడియం మంటపై ఒకటి రెండు నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. ఆపై మూత తీసి, మధ్యమధ్యలో తిప్పుతూ అన్ని వైపులా సమానంగా వేయించాలి. సగ్గుబియ్యంతో చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా వేయించనవసరం లేదు.. పైన రంగు మారి క్రిస్పీగా మారితే సరిపోతుంది. వేయించిన వాటిని ప్లేట్‌లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేయాలి.

సాధారణ పాన్‌లో: గుంత పొంగనాల పాన్ లేని వారు, పిండిని కొద్దిగా పెద్ద ఉండలుగా చేసుకుని, అరచేతిలో అప్పాల వలె ఒత్తి, సాధారణ పాన్‌లో మూడు నాలుగు టీస్పూన్ల నూనెతో వేయించుకోవచ్చు. మీడియం మంటపై రెండు నిమిషాలు ఒక వైపు కాల్చి, జాగ్రత్తగా తిప్పి మరో వైపు కాల్చాలి. మొత్తం మూడు నాలుగు నిమిషాలు పడుతుంది. ఇవి కూడా పైన క్రిస్పీగా, బంగారు రంగులోకి మారితే సరిపోతుంది.

ఈ ఆరోగ్యకరమైన, రుచికరమైన సగ్గుబియ్యం అల్పాహారాన్ని ఎలాంటి చట్నీ లేకపోయినా లేదా టమాటా సాస్‌తో కలిపి ఆస్వాదించవచ్చు. మీ ఇంట్లో వారందరూ ఈ ప్రత్యేకమైన వంటకాన్ని తప్పకుండా ఇష్టపడతారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us