AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..? పరిశోధనలో అవాక్కయ్యే విషయాలు..

Running vs Swimming: గుండె ఆరోగ్యం అనగానే మనకు గుర్తొచ్చేది రన్నింగ్ లేదా వాకింగ్. కానీ రన్నింగ్ కంటే ఈత' కొట్టడమే గుండెకు వంద రెట్లు మేలని మీకు తెలుసా? బ్రెజిల్‌లోని శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగుచూశాయి. పరుగుతో రాని మార్పులు ఈతతో ఎలా సాధ్యమయ్యాయి? గుండెను దృఢంగా మార్చే ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..? పరిశోధనలో అవాక్కయ్యే విషయాలు..
Running Vs Swimming
Krishna S
|

Updated on: May 03, 2026 | 6:45 AM

Share

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. దీని నుంచి తప్పించుకోవడానికి చాలామంది రన్నింగ్ లేదా వాకింగ్‌ చేస్తుంటారు. అయితే మీరు కేవలం ఫిట్‌నెస్ కోసమే కాకుండా మీ గుండెను మరింత బలంగా మార్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీరు ట్రాక్ మీద పరుగెత్తడం కంటే స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడం ఉత్తమమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. బ్రెజిల్‌లోని సావో పాలో ఫెడరల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

పరుగు vs ఈత: అసలు తేడా ఎక్కడ..?

చాలా కాలంగా అన్ని రకాల ఏరోబిక్ వ్యాయామాలు గుండెపై ఒకే విధమైన ప్రభావాన్ని చూపుతాయని అందరూ భావిస్తారు. కానీ ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ సావో పాలో పరిశోధకులు ఈ నమ్మకాన్ని సవాలు చేశారు. పరుగెత్తడం, ఈత కొట్టడం రెండూ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచినప్పటికీ, గుండె నిర్మాణాన్ని మార్చడంలో ఈతకు సాటిలేదని వారి పరిశోధన స్పష్టం చేసింది. యూనిఫెస్ప్ ప్రొఫెసర్ ఆండ్రే జార్జ్ సెర్రా నేతృత్వంలో ఈ పరిశోధన సాగింది. ఆయన వివరణ ప్రకారం.. ఈత కొట్టడం వల్ల కేవలం శారీరక శక్తి పెరగడమే కాకుండా మన శరీరంలోని జీవక్రియలు కూడా సానుకూలంగా మారుతాయి.

శాస్త్రీయ పరిశోధన వివరాలు

ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ఎనిమిది వారాల పాటు కొనసాగింది. పరిశోధకులు ఎలుకలపై ఈ ప్రయోగం చేశారు. వాటిని మూడు గ్రూపులుగా విభజించారు.

కంట్రోల్ గ్రూప్: ఎలాంటి వ్యాయామం చేయనివి.

రన్నింగ్ గ్రూప్: రోజుకు ఒక గంట చొప్పున వారానికి ఐదు రోజులు ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తేవి.

స్విమ్మింగ్ గ్రూప్: అదే సమయంలో నీటిలో ఈత కొట్టేవి.

ఈ వ్యాయామాల ప్రభావాన్ని అంచనా వేయడానికి VO₂ గరిష్ట విలువ అనే కొలమానాన్ని ఉపయోగించారు. అంటే వ్యాయామం చేసే సమయంలో శరీరం ఆక్సిజన్‌ను ఎంత సమర్థవంతంగా వాడుకుంటుంది అనే అంశాన్ని ఇది తెలియజేస్తుంది.

పరిశోధనలో వెల్లడైన కీలక ఫలితాలు

ఎనిమిది వారాల తర్వాత వచ్చిన ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.

ఫిట్‌నెస్ స్థాయి: పరుగు, ఈత కొట్టిన రెండు సమూహాల్లోనూ ఫిట్‌నెస్ 5 శాతానికి పైగా పెరిగింది.

గుండె నిర్మాణం: ఈత కొట్టిన ఎలుకల్లో గుండె పరిమాణం పెరగడంతో పాటు రక్తాన్ని పంప్ చేసే ఎడమ జఠరిక ద్రవ్యరాశి గణనీయంగా పెరిగింది. అంటే వాటి గుండె రక్తాన్ని శరీరమంతటా పంపడానికి మరింత సమర్థవంతంగా తయారైంది. ఆశ్చర్యకరంగా.. పరుగెత్తిన ఎలుకల గుండె నిర్మాణంలో ఎలాంటి మార్పులు రాలేదు. వాటి గుండెలు వ్యాయామం చేయని సమూహంలాగే ఉన్నాయి.

అణు స్థాయిలో మార్పులు

ఈ అధ్యయనంలో అత్యంత కీలకమైన అంశం మైక్రోఆర్ఎన్ఏల పనితీరు. ఇవి మన కణాల్లో ప్రోటీన్ల ఉత్పత్తిని నియంత్రిస్తాయి. ఈత కొట్టడం వల్ల ఈ అణువుల్లో సానుకూల మార్పులు వచ్చాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

  • గుండె కణాల పెరుగుదలకు దోహదపడింది.
  • కొత్త రక్తనాళాల ఏర్పాటును ప్రోత్సహించింది.
  • గుండె కణాలు దెబ్బతినకుండా రక్షణ కల్పించింది.
  • గుండె సంకోచించే సామర్థ్యాన్ని మెరుగుపరిచింది.

నిపుణుల సలహా ఏంటి..?

సాధారణంగా ప్రజలు తమకు నచ్చిన వ్యాయామాన్ని ఎంచుకుంటారు. అయితే గుండె జబ్బుల నుంచి కోలుకునే వారికి ఈత అనేది ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుందని ప్రొఫెసర్ సెర్రా నొక్కి చెప్పారు. అన్ని ఏరోబిక్ వ్యాయామాలు సమానం కావని, గుండె ఆరోగ్యంపై ఈతకు ఉన్న ప్రత్యేక ప్రభావం వైద్య రంగంలో కొత్త మార్పులకు శ్రీకారం చుడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. మీరు ఫిట్‌గా ఉండటానికి రన్నింగ్ చేయొచ్చు.. కానీ మీ గుండెను లోపలి నుండి అత్యంత శక్తివంతంగా మార్చుకోవాలనుకుంటే మాత్రం ఈత కొట్టడం అత్యుత్తమ మార్గమని ఈ అధ్యయనం నిరూపించింది.

Follow Us