
మనలో చాలా మంది వారంలో నాలుగు నుంచి ఐదు రోజులు నాన్ వెజ్ తింటారు. వాటిలో ఎగ్ తప్పకుండా ఉంటుంది. మనం రోజూ వండుకునే కూరలే మన శరీరానికి కావాల్సిన పోషకాలు దొరుకుతాయి. అందరూ రైస్ ఎక్కువగా తీసుకుంటారు. కానీ, వాటి కంటే కూరలే ఎక్కువగా తినాలి. ఇలా తిన్నప్పుడు వాటిలో ఉండే ప్రోటీన్స్ మన శరీరానికి అందుతాయి. వాటిలో మన శరీరానికి ఎక్కువ ప్రోటీన్స్ అందించే కూర బీరకాయ కోడిగుడ్డు. కొందరికి ఈ కూర గురించి ఇప్పుడే మొదటి సారి విని ఉంటారు. ఇక అలాంటి వారికీ ఇది ఎలా తయారు చేస్తారో కూడా తెలియదు. ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..
దీనికి కావాల్సిన పదార్థాలు
బీరకాయ – ఒక కప్పు బీరకాయ ముక్కలు, గుడ్లు – 4 , ఉల్లిపాయలు – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్, పచ్చిమిర్చి – 4 పెద్దవి,
కారం – 1 టీస్పూన్ (రుచికి తగినంత), ఉప్పు- 1 టీ స్పూన్ (రుచికి తగినంత), పసుపు – 1 టీ స్పూన్ , ధనియాల పొడి – 1 టీస్పూన్, గరం మసాలా – అర టీస్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్లు, తాలింపు గింజలు- 1 టీ స్పూన్ , కొత్తిమీర – కూరకి సరిపడా తీసుకోవాలి.
తయారీ విధానం
దీనికి కావాల్సిన పదార్థాలను ఒక దగ్గర పెట్టుకుని ముందుగా స్టవ్ వెలిగించి పాన్‌లో నూనె వేసి అది వేడయ్యాక, దానిలో తాలింపు గింజలు వేసి ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా వేయించి రంగు మారే వరకు స్టవ్ మీదే ఉంచండి. ఇక ఇప్పుడు ఆ మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక రెండు నిముషాలు బాగా వేయించాలి. ఆ తర్వాత వాటిలో నాలుగు కోడిగుడ్లను బ్రేక్ చేసి వేసుకోవాలి. పచ్చి వాసన పొయ్యే వరకు కోడిగుడ్లు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వాటిలో ముందుగా కట్ చేసిన కప్పు బీరకాయ ముక్కలను వేసి బాగా తిప్పాలి. ఇక ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి కాసేపు వేయించండి. కొద్దీ సేపటి తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి తక్కువ మంట మీద ఉడికించాలి. బీరకాయ, గుడ్డు కూర అయిన తర్వాత చివరిగా దించే ముందు కట్ చేసిన కొత్తిమీర వేసి గరిటెతో తిప్పుకుని ఒక ఐదు నిముషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి కూరను దించేయండి. అంతే వేడి వేడి బీరకాయ, గుడ్డు కూర రెడీ.
ఈ కూరను అన్నంతో కలిపి తినే కంటే చపాతీలో తింటే రుచికరంగా ఉంటుంది. అంతే కాదు, వీటితో అనేక లాభాలు కూడా ఉన్నాయి.
ఈ కూర వారంలో మూడు సార్లు తింటే కండరాలు బలంగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణ క్రియ పని తీరు కూడా మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తీ కూడా పెరుగుతుంది. గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.