AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిచ్చి మొక్క అని పీకి పారేయకండి.. ఇదొక అద్భుతమైన ఔషధ నిధి.. ఆ రోగాలు ఫటాఫట్..

పనికిరాని పిచ్చి మొక్కగా కనిపించే నేల ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. కాలేయ ఆరోగ్యం, కామెర్లు, మూత్రపిండాల రాళ్లు, శ్వాసకోశ సమస్యలు వంటి పలు సమస్యలకు ఆయుర్వేదంలో దీనిని వినియోగిస్తారు. అయితే ఈ ప్రయోజనాలపై శాస్త్రీయ ఆధారాలు అన్ని సందర్భాల్లో పరిమితంగానే ఉన్నందున, చికిత్స కోసం వాడే ముందు తప్పనిసరిగా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి.

పిచ్చి మొక్క అని పీకి పారేయకండి.. ఇదొక అద్భుతమైన ఔషధ నిధి.. ఆ రోగాలు ఫటాఫట్..
Nela Usiri Benefits
Shaik Madar Saheb
|

Updated on: Jul 06, 2026 | 5:39 PM

Share

ప్రకృతిలో అనేక మొక్కలు మనకు లభ్యమవుతాయి, వాటిలో కొన్నింటి ప్రాముఖ్యతను మనం తరచుగా విస్మరిస్తుంటాం. అలాంటి మొక్కలలో నేల ఉసిరి ఒకటి. ఈ చిన్న మొక్క, దాదాపు 60 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతూ, మన ఇళ్ల మధ్య, పొలాల్లో విరివిగా కనిపిస్తుంది. దీని ఆకుల కింది భాగంలో చిన్న పుష్పాలు పూచి, ఆకుల కిందే కాయలు కాస్తాయి.. అందుకే దీనిని ఆంగ్లంలో ‘సీడ్ అండర్ లీఫ్’ అని పిలుస్తారు. ఫిలాంథేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం ఫిలాంథస్ నిరూరి లేదా ఫిలాంథస్ అమారస్. ఎన్నో అంతుపట్టని రోగాలను నయం చేయగల అద్భుత ఔషధ గుణాలు ఈ మొక్కలో నిక్షిప్తమై ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

కాలేయ రక్షణకు నేల ఉసిరి:

నేల ఉసిరి యొక్క ప్రధాన ప్రయోజనాలలో ఒకటి కాలేయ ఆరోగ్యానికి అది అందించే మద్దతు. పరిశోధనల ప్రకారం, నేల ఉసిరి హెపటైటిస్ బి వంటి తీవ్రమైన కాలేయ వ్యాధులను తగ్గించగలదు. ఒక అధ్యయనంలో, 37 మంది రోగులకు 30 రోజుల పాటు రోజుకు 600 మిల్లీగ్రాముల నేల ఉసిరిని ఇవ్వగా, 60 శాతం మందికి పూర్తిగా నయమైనట్లు తేలింది. ఆయుర్వేదం ప్రకారం, నేల ఉసిరి వేరును సేకరించి పాలల్లో మరిగించి, 40 రోజుల పాటు సేవిస్తే కాలేయ సంబంధిత వ్యాధులు పూర్తిగా నయమవుతాయి.

శ్వాసకోశ – రక్తహీనత నివారణ:

ఈ రోజుల్లో చాలా మందిని పీడిస్తున్న శ్వాసకోశ రోగాలకు నేల ఉసిరి ఒక మంచి పరిష్కారం. చరక మహర్షి గ్రంథం ప్రకారం, నేల ఉసిరిని శుభ్రం చేసి, దంచి రసం తీసి, అందులో పటికబెల్లం చూర్ణం కలిపి ఒక స్పూన్ సేవిస్తే శ్వాస రోగాలు తగ్గుతాయి. అలాగే, రక్తహీనతతో బాధపడేవారు నేల ఉసిరి వేర్లను 10 గ్రాముల మోతాదుగా నూరి రసం తీసి, అరగ్లాసు ఆవుపాలలో కలిపి, ఆహారానికి గంట ముందు రెండు పూటలా తీసుకుంటే రక్తహీనత తగ్గి, కాలేయానికి బలం చేకూరి, రక్తశుద్ధి, రక్తవృద్ధి జరుగుతుంది.

కామెర్లు – మూత్రపిండాల ఆరోగ్యానికి:

పచ్చకామెర్లు (జాండిస్) నివారణకు నేల ఉసిరి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. దీని ఆకుల రసం ఒక టీ స్పూన్ లేదా దంచిన ముద్దను గోళీ పరిమాణంలో కానీ, లేదా చూర్ణం ఒక స్పూన్ మోతాదులో కానీ ఉదయం పెరుగులో కలిపి, మజ్జిగ అన్నం వంటి చప్పిడి ఆహారంతో తీసుకుంటే నాలుగు లేదా ఐదు రోజుల్లో కామెర్లు తగ్గుతాయి. మూత్ర రోగాలను, ఒంటి నిండా చెడు నీరు పట్టిన ఉబ్బు రోగాలను కూడా నేల ఉసిరి సులభంగా తగ్గిస్తుంది. దీని ఆకుల రసం ఒక స్పూన్ మోతాదుగా గ్లాసు నాటు ఆవు పాలలో కలిపి రెండు పూటలా తాగితే సమస్త మూత్ర రోగాలు పోతాయి. 2004లో ఒక పరిశోధన నేల ఉసిరికి కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఉందని నిరూపించింది. ముఖ్యంగా కాల్షియం ఆక్సలేట్ స్పటికాలను కరిగించగలదు. దీని కషాయం తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటకు పోతాయి.

ఇతర ముఖ్యమైన ప్రయోజనాలు:

క్యాన్సర్ నివారణ: 2010 నాటి పరిశోధనలు నేల ఉసిరికి క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి ఉందని, శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టి, భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా చేయగలదని చూపించాయి.

శరీర శుద్ధి – రోగనిరోధక శక్తి: నేల ఉసిరిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు దీని ఆకులను కొద్ది మొత్తంలో పరగడుపున తింటే శరీరంలోని విషతుల్యాలు బయటకు పోయి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. దీని కషాయం రక్తాన్ని శుద్ధి చేసి చర్మ వ్యాధులు దరిచేరకుండా చేస్తుంది.

గాయాలు – పుండ్ల చికిత్స: శరీరంపై వాపులు, గాయాలు, పుండ్లపై నేల ఉసిరిని దంచి, రసం తీసి పసుపు కలిపి పైపూతగా అప్లై చేస్తే త్వరగా తగ్గుతాయి. ఇది బ్యాక్టీరియా, ఫంగస్‌లను కూడా అరికడుతుంది.

ఇతర ఉపయోగాలు: దగ్గు బాధిస్తుంటే కషాయం కాచి తేనె కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది. ఆకలి లేకపోవడం సమస్య ఉన్నప్పుడు దీనిని ఏదో విధంగా కడుపులోకి తీసుకుంటే ఆకలి కలుగుతుంది. స్త్రీల తెల్లబట్ట రోగాలకు, పాముకాటు విషానికి విరుగుడుగా కూడా ఈ మొక్కను ఉపయోగిస్తారు. పూర్వం ఎముకలు విరిగినప్పుడు దీనిని ఉప్పులో దంచి కట్టుగా కట్టేవారు. నోటి పూత, పుండ్లు ఉన్నప్పుడు దీని నీటితో పుక్కిలిస్తే ఉపశమనం లభిస్తుంది.

అందుకే.. తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో ఈ మొక్కను ఔషధంగా వినియోగిస్తున్నారు.. సాగు కూడా చేస్తున్నారు. కాబట్టి, నేల ఉసిరి పనికిరాని మొక్క కాదు, మన ప్రాణాలను కాపాడే ఒక అద్భుతమైన ఔషధ మొక్క అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

నోట్: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా అనారోగ్య సమస్యలున్నా.. సందేహాలున్నా.. వెంటనే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us