
చాలా మంది డాక్టర్ సంప్రదించకుండానే, ప్రిస్క్రిప్షన్ లేకుండానే తమకు వచ్చే వ్యాధులకు తామే వైద్యం చేసుకుంటూ ఉంటారు. నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి పారాసెటమాల్ లేదా డోలో 650 మాత్రలను తీసుకుంటూ ఉంటారు. డాక్టర్ దగ్గరకు వెళ్లినా దీనినే సూచిస్తారనే వైఖరిని చాలా మందిలో ఉంటుంది. అందుకే వీటిని తీసుకుంటే ఎలాంటి హానిచేయని భావించి చీటికి మాటికి పెప్పరమెంట్లు తిన్నట్లు తెగ తినేస్తుంటారు. దీనివల్ల కొంతమందికి దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇది కాలేయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల అమెరికాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఆరోగ్య విద్యావేత్త డాక్టర్ పళనియప్పన్ మాణిక్కం దీనిపై సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఇందులో భారతీయులు డోలో 650ని క్యాడ్‌బరీ జెమ్స్ లాగా తీసుకుంటారు అని చమత్కరించారు. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయింది.
పారాసెటమాల్ అనేది అనాల్జేసిక్, యాంటిపైరేటిక్ ఔషధం. దీనిని తేలికపాటి నుండి మితమైన నొప్పి, జ్వరాన్ని తాత్కాలికంగా తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇది తరచుగా జలుబు, ఫ్లూ మందులలో ఒక పదార్ధంగా చేర్చబడుతుంది. ఇది టైలెనాల్ లాంటి మందు. ఇది యునైటెడ్ స్టేట్స్‌లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం 1878 లో మొదటిసారిగా ఈ ఔషధం తయారు చేశారు. మెదడులోని రసాయన చర్యలను నిరోధించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఇది అనారోగ్యాన్ని ప్రభావితం చేసే శరీరం నుంచి ఉత్పత్తి అయ్యే ప్రోస్టాగ్లాండిన్ల ఉత్పత్తిని నిరోధిస్తుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పారాసెటమాల్ సరిగ్గా ఉపయోగిస్తేనే సురక్షితంగా పరిగణించబడుతుంది. పారాసెటమాల్ సాధారణంగా 500 mg, 650 mg మాత్రలు, 1000 mg ఇంజెక్షన్ రూపాల్లో లభిస్తుంది. వైద్య మార్గదర్శకాల ప్రకారం.. పెద్దలకు గరిష్టంగా మోతాదు రోజుకు 4 గ్రాములు (లేదా 4000 మి.గ్రా) సరిపోతుంది. అంటే 500 mg మాత్రలు 24 గంటల వ్యవధిలో 8 వరకు తీసుకోవచ్చు. మోతాదుల మధ్య కనీసం 4 గంటల వ్యవధి ఉండాలి. 10 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు రోజుకు 4 సార్లు పారాసెటమాల్ మాత్రలు ఇవ్వాలి. బదులుగా పిల్లలకు ఎక్కువ పారాసెటమాల్ ఇస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పారాసెటమాల్ కాలేయానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు. మొదటి 24 గంటలు అధిక మోతాదు లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ క్రమేనా పాలిపోవడం, వికారం, చెమటలు పట్టడం, వాంతులు, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.