
మీ ఆహారంలో రాగులు చేర్చుకోవటం వల్ల శరీరానికి అద్భుతమైన లాభాలు చేకూరుతాయి. అందుకే ఇటీవలి కాలంలో చాలామంది రాగులను తమ ఆహారంలో భాగంగా చేర్చుకుంటున్నారు. రాగి పిండితో చేసిన ఆహారాల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ముఖ్యంగా B-కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో శరీరానికి అవసరమయ్యే ఖనిజాలు మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటివి, యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు కూడా అందుతాయి. కాబట్టి ప్రతిరోజు ఆహారంలో రాగి పిండితో తయారుచేసిన రోటీలు లేదా లడ్డూలను తప్పనిసరిగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అందుకే మనం కమ్మటి నోరూరించే రాగి లడ్డూలు తయారీ విధానం తెలుసుకుందాం..
1 కప్పు రాగి పిండి లేదా గోధుమ పిండి, 1/4 కప్పు ఎండు కొబ్బరి, 3/4 కప్పు బెల్లం, 1/4 కప్పు నీరు, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, చిటికెడు ఏలకుల పొడి తీసుకోవాలి. ముందుగా ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్‌ల నెయ్యి వేడి చేసి జీడిపప్పు వేయించి తీసి పక్కన పెట్టుకోండి. తరువాత, అదే పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి రాగి పిండిని ఫ్రై చేయండి. రాగి పిండి కొద్దిగా రంగు మారే వరకు లేదా మంచి వాసన వచ్చే వరకు మీడియం మంట మీద వేయించి, దాదాపు 10 నిమిషాలు ఉడికించాలి. చివరగా, ఎండు కొబ్బరి తురుము వేసి మరో నిమిషం వేయించి, స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టుకోండి.
తరువాత అదే పాన్ లో బెల్లం, నీళ్లు తీసుకుని మరిగించుకోవాలి. యాలకుల పొడి వేసి లేత తీగపాకం వచ్చే వరకు మరిగించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ వెంటనే వేయించిన రాగి పిండి, కొబ్బరి, జీడిపప్పులపై బెల్లం సిరప్ పోయాలి. బాగా కలిపి వేడి తగ్గే వరకు వేచి ఉండండి. కాస్త గోరువెచ్చగా ఉండగానే నిమ్మకాయ సైజు పరిమాణంలో చిన్న చిన్న బాల్స్‌గా చేయండి. మొదట్లో లడ్డూ కొద్దిగా మెత్తగా ఉంటుంది. చల్లబడిన తర్వాత గట్టిపడుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..