
తాజా అధ్యయనంలో స్పెయిన్ పరిశోధకులు ఫాస్ఫోరైలేటెడ్ టౌ (p-tau217) అనే ప్రోటీన్ పై దృష్టి సారించారు. ఇది మెదడులో సహజంగా ఉండే ప్రోటీన్, నాడీ కణాలను (న్యూరాన్లు) స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. కానీ ఈ ప్రోటీన్ అసాధారణంగా పెరిగితే ఇది న్యూరాన్ల మధ్య కమ్యూనికేషన్‌కు అంతరాయం కలిగిస్తుంది. దీని ఫలితంగా మెదడు పనితీరు తగ్గడం, అల్జీమర్స్ వంటి న్యూరోడీజెనరేటివ్ వ్యాధులు వస్తాయి. ఫాస్ఫోరైలేటెడ్ టౌ ఈ వ్యాధికి ప్రత్యక్ష కారణంగా చెప్పినప్పటికీ.. రక్తంలో దీని అధిక స్థాయిలు కనుగొనడం ద్వారా అల్జీమర్స్ ముందస్తుగా గుర్తించవచ్చు.
పరిశోధకులు చిత్తవైకల్య సంబంధిత సమస్యలతో వచ్చిన 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల 200 మంది కొత్త రోగులను పరీక్షించారు. వైద్యులు మొదట సాధారణ క్లినికల్ అంచనా ఆధారంగా రోగ నిర్ధారణ చేసి, వాటిని నమోదు చేశారు. తరువాత వారు p-tau217 రక్త పరీక్ష ఫలితాలను సమీక్షించి, అవసరమైతే రోగ నిర్ధారణను సవరించారు. రక్త పరీక్ష లేకుండా వైద్యులు 75.5% కేసులలో అల్జీమర్స్‌ను సరిగ్గా నిర్ధారించారు. కానీ p-tau217 రక్త పరీక్ష ఫలితాలను చేర్చినప్పుడు రోగ నిర్ధారణ ఖచ్చితత్వం 94.5%కి పెరిగింది. అంటే ఇది 19% పెరుగుదలను సూచిస్తుంది. దీని అర్థం నలుగురిలో ఒకరికి వారి ప్రారంభ రోగ నిర్ధారణను మార్చవలసి వచ్చింది. కొంతమందికి మొదట అల్జీమర్స్ ఉందని భావించారు. కానీ తరువాత వారికి ఇతర వ్యధులు కూడా ఉన్నట్లు నిర్ధారణ అయింది. మరోవైపు ప్రారంభంలో సాధారణ వృద్ధాప్యం ఉందని భావించిన వారిలో కొంతమందికి అల్జీమర్స్ ఉన్నట్లు నిర్ధారించారు.
నేటి వేగంగా పెరుగుతున్న జనాభాలో అల్జీమర్స్, చిత్తవైకల్యం కేసుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతుంది. ప్రస్తుతం, అల్జీమర్స్‌ను గుర్తించడానికి ఉపయోగించే మెదడు స్కాన్‌లు, వెన్నెముక ట్యాప్ పరీక్షలు ఖరీదైనవిగా ఉన్నాయి. దీంతో ఇవి అందరికీ సులభంగా అందుబాటులో లేవు. వీటికి బదులు సాధారణ రక్త పరీక్ష ద్వారా కూడా చాలా సులభంగా ఈ వ్యధి ఫలితాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఎవరైనా ఈ పరీక్ష చేయగలిగేలా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది లక్షలాది మందికి సకాలంలో చికిత్స, మెరుగైన సంరక్షణ పొందడానికి సహాయపడుతుంది. కానీ ఈ రక్త పరీక్ష మన దేశంలో ఇంకా ప్రారంభించబడలేదు. ఇది ఇప్పటికీ పరిశోధన దశలోనే ఉంది. దీని విస్తృత ఉపయోగం త్వరలోనే రానుంది. అలాగే జనరల్ ఆసుపత్రులలో, ప్రజారోగ్య వ్యవస్థలలో దీని ఉపయోగం ఇంకా ప్రారంభం కాలేదు. అందువల్ల ఇది భవిష్యత్తుకు ఆశాజనకమైన సాధనం అయినప్పటికీ దీనిని ఇంకా ప్రయోగాత్మకంగా మెరుగుపరచవల్సి ఉంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.