మటన్‌లోని ప్రతీ పార్టూ పవర్‌ఫులే మావ.. ఇవి తింటే ఆ రోగాల ముచ్చటే ఉండదు..
మటన్ కేవలం రుచికే కాదు.. శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ B12, సెలీనియం వంటి పోషకాలను అందిస్తుంది. మటన్ లివర్‌లో ఐరన్, B12 అధికంగా ఉండగా.. మేక కాళ్ల సూప్ ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని చెబుతారు. తలకాయ, బోటీ వంటి ఇతర భాగాల్లోనూ వివిధ పోషకాలు లభిస్తాయి. అయితే మటన్‌ను మితంగా తీసుకోవడం, డీప్ ఫ్రై కంటే సాధారణ కూరగా వండుకోవడం మంచిది.

మాంసాహార ప్రియులకు మటన్ అత్యంత ఇష్టమైన ఆహారాల్లో ఒకటి.. రుచికే కాకుండా, మటన్‌లో ఉండే వివిధ భాగాలు మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. మేక మాంసం.. మటన్ కాలేయం (లివర్), మేక కాళ్ళు, తలకాయ, బోటీ వంటి విభిన్న భాగాలు తినడం వల్ల.. శరీరానికి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని.. నాన్ వెజ్ తినేవారు తప్పనిసరిగా మటన్‌ను ఒకసారి భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. వాస్తవానికి, మటన్‌లో నాణ్యమైన ప్రోటీన్లు, ఐరన్, జింక్, విటమిన్ B12, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు రక్తహీనతను తగ్గించి, ఎముకలు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుందని పేర్కొంటున్నారు.
మటన్ పార్ట్స్ ప్రత్యేకతలు.. లాభాలు..
మటన్ లివర్ (కాలేయం) – తిల్లి: మటన్ లివర్, తిల్లీలో ఐరన్, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తహీనత (ఎనీమియా) సమస్య తగ్గుతుంది. ఇంకా శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.
మేక కాళ్ళ సూప్ (మటన్ బోన్ సూప్): ఎముకలకు బలాన్ని ఇస్తుంది. మేక కాళ్లను కాల్చి తయారుచేసే సూప్ తాగడం వల్ల అంటువ్యాధులు రాకుండా నిరోధించవచ్చు. జలుబు, ఎముకలు బలహీనపడటం లేదా విరగడం వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ సూప్ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, ఎముకలను దృఢపరుస్తుంది.
మేక తలకాయ కూర: మేక తలకాయలో ప్రోటీన్లు, ఐరన్, కొవ్వు పుష్కలంగా ఉంటాయి. రెడ్ మీట్ ఇష్టపడని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. ఈ కూర తినడం వల్ల శరీరం గట్టిపడుతుంది.
మటన్ బోటీ (పేగులు): మేక పేగులలో విటమిన్ A, B12, D, E, K లు లభిస్తాయి. ఇది శరీరానికి పోషకాలను అందించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బోటీని కూరగా లేదా ఫ్రైగా వండుకుని తినడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
జాగ్రత్తలు – సూచనలు:
వారానికి ఒకసారి మటన్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. అయితే మటన్‌ను ఎక్కువగా నూనెలో వేయించడం (Deep Fry) లేదా గ్రిల్ చేయడం కంటే, సాధారణ పద్ధతిలో కూరగా వండుకుని తినడమే మంచిది. ఫ్రై చేయడం వల్ల కొవ్వు శాతం పెరిగే అవకాశం ఉంటుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇంకా.. కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు.. పలు సమస్యలతో బాధపడుతున్న వారు మేక మాంసం తినే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
