Traffic Police: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇకపై వాటితో రోడ్డుపైకి వస్తే అంతే..
బైకులకు, ఆటోలకు సైలెన్సర్ మార్చి భారీ శబ్దంతో తోటి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరవ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ.. అదిక శబ్ధాలు చేసే వాహనాలను అడ్డుకొని వాటి సైలెన్సర్లను తొలగిస్తున్నారు. నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కర్నూలు, ఆగస్ట్ 24: నగరంలో బైకులు, ఆటోలకు సైలెన్సర్లు మార్చి భారీ శబ్దంతో తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వాహనాలపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. శబ్ద కాలుష్యానికి ఎక్కడా తావు ఇవ్వకూడదని ఆయన స్పష్టం చేయడంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో సోమవారం ఓల్డ్ పీసీఆర్ సర్కిల్ పరిసర ప్రాంతాలతో పాటు ప్రధాన కూడళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. అధిక శబ్దం చేస్తూ వస్తున్న 5 మోడిఫైడ్ సైలెన్సర్లు కలిగిన ద్విచక్ర వాహనాలను గుర్తించి, ఆ సైలెన్సర్లను తొలగించి స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా పెద్ద శబ్దంతో హారన్లు వినియోగిస్తున్న 50 ఆటోలను గుర్తించి వాటి హారన్లను తొలగించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన మొత్తం 55 వాహనాలపై ఎంవీఐ చట్టం ప్రకారం భారీ జరిమానాలతో కూడిన ఈ-చలాన్లు విధించారు. పాఠశాలలు, ఆసుపత్రులు, నివాస ప్రాంతాల్లో అధిక శబ్దంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఐ మన్సూరుద్దీన్ హెచ్చరించారు.
నగరంలోని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మోడిఫైడ్ సైలెన్సర్లు, పెద్ద శబ్దం చేసే హారన్లను వినియోగించవద్దని ఆయన సూచించారు. పోలీసుల ముమ్మర తనిఖీలతో నగరంలో శబ్ద కాలుష్యం గణనీయంగా తగ్గడంతో వాహనదారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే పోకిరీల పనిపట్టినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
