
నాన్‌వెజ్ ప్రియులు చికెన్, మటన్‌ను ఇష్టంగా తింటారు. అయితే.. మాంసాహార ప్రియులలో చికెన్ ఒక ప్రసిద్ధ ఎంపిక అయినప్పటికీ, దాని వినియోగంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్‌లో లభించే చికెన్‌లో అధిక శాతం మందులతో పెంచినవి కావడంతో, నాటుకోడిని లేదా మటన్‌ను ఎంచుకోవడం ఆరోగ్యానికి మరింత శ్రేయస్కరం. వాస్తవానికి, కోడి మాంసం కంటే మటన్‌లోనే ఎక్కువ పోషకాలు.. విటమిన్‌లు ఉంటాయి. మటన్ బిర్యానీతో పాటు, వివిధ మటన్ వంటకాలకు ప్రత్యేకమైన రుచి, డిమాండ్ ఉన్నాయి. ప్రస్తుతం మటన్ ధర కిలోకు రూ. 900 నుండి రూ.1000 వరకు ఉండగా, బోన్‌లెస్ మటన్ ధర రూ. 1500 వరకు పలుకుతోంది.
మటన్‌లో ఉండే ప్రతి భాగం శరీరానికి అవసరమైన విభిన్న పోషకాలను కలిగి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మటన్ లివర్: మటన్ లివర్‌లో ఐరన్, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. వారానికి ఒకసారి నాన్ వెజ్ తీసుకునేవారు మటన్ లివర్‌ను కూడా ఆహారంలో చేర్చుకుంటే రక్తహీనత తగ్గుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అయితే, దీనిని ఎక్కువగా తినకూడదు. నెలకొకసారి లేదా రెండు నెలలకొకసారి మాత్రమే తీసుకోవడం మంచిది.
మేక కాళ్లు (మటన్ బోన్ సూప్): మేక కాళ్ళను కాల్చి తయారు చేసే సూప్ అంటు వ్యాధులు రాకుండా చేస్తుంది. జలుబు, ఎముకలు విరిగిన వారు మటన్ బోన్ సూప్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.. ఎముకలను బలంగా మారుస్తుంది.
మేక తలకాయ: మేక తలకాయలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఐరన్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దీనిని కాల్చి ముక్కలుగా చేసి కూర వండుకుని రోటీలు లేదా అన్నంతో తింటారు. రెడ్ మీట్ ను ఇష్టపడని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. తలకాయ కూర తింటే శరీరం దృఢంగా మారుతుందనే నమ్మకం కూడా ఉంది.
మటన్ బోటీ (పేగులు): మటన్ బోటీ అంటే పేగులు. వీటిలో రకరకాల పోషకాలు ఉంటాయి. మేక పేగులలో విటమిన్లు ఎ, బి12, డి, ఇ, కె వంటి ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి. మటన్ బోటీని కూరగా వండుకుని లేదా ఫ్రై చేసుకుని తింటే ప్రేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అయితే, మటన్ వల్ల లాభాలు ఉన్నాయని ప్రతి వారం తినడం మంచిది కాదు. నెలకొకసారి లేదా రెండు నెలలకొకసారి మాత్రమే మటన్‌ను తీసుకోవడం ఆరోగ్యకరం. లేకపోతే, శరీరంలో కొవ్వు బాగా పెరిగి, కాలేయం, కిడ్నీలకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎరుపు మాంసాన్ని అధికంగా తీసుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. మీ ఆహారంలో మార్పులు చేసే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..