Mutton: బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మట‌న్‌లోని ఈ పార్ట్ తింటే ఇక తిరుగుండదంతే..

మేక మెదడు (మటన్ బ్రెయిన్) కూర బలహీనంగా ఉన్న పిల్లలకు, ఆపరేషన్ల నుండి కోలుకుంటున్న వారికి, కండరాల నిర్మాణానికి అద్భుతమైన పోషకాహారం. ఇందులో తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, ప్రోటీన్ ఉంటాయి. రక్తం గడ్డకట్టకుండా చేసి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఈ రుచికరమైన వంటకం ప్రయోజనాల గురించి తెలుసుకోండి..

Mutton: బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మట‌న్‌లోని ఈ పార్ట్ తింటే ఇక తిరుగుండదంతే..
Goat Brain Curry Recipe

Updated on: Jan 20, 2026 | 5:53 PM

నాన్ వెజ్ ప్రియులు మటన్ (మేక మాంసం) ను ఎంతో ఇష్టంగా తింటారు.. అయితే.. మేకలోని పలు భాగాలు.. ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంటాయి.. ఒక్కో పార్ట్.. ఒక్కో ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది.. మటన్ తిల్లి, తలకాయ, లివర్, పాయా అన్ని స్పెషలే.. అయితే.. మేక మెదడు కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.. మేక మెదడులో ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ B12, ఐరన్, భాస్వరం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.. ఇవి మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, రక్త ఉత్పత్తి, కండరాల బలానికి మేలు చేస్తాయి. కణాల మరమ్మత్తుకు సహాయపడటమే కాకుండా.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

నాన్-వెజ్ ఆహారాన్ని ఇష్టపడేవారికి, ప్రత్యేకించి ఆరోగ్య ప్రయోజనాలను కోరుకునేవారికి మేక మెదడు కూర ఒక అద్భుతమైన ఎంపిక అని డైటీషియన్లు చెబుతున్నారు. ఈ వంటకం కేవలం రుచిని మాత్రమే కాకుండా, అనేక పోషక విలువలను కూడా అందిస్తుంది. ముఖ్యంగా, ఎదుగుతున్న పిల్లలకు, శారీరకంగా బలహీనంగా ఉన్నవారికి, ఇటీవల ఆపరేషన్ల నుండి లేదా గాయాల నుండి కోలుకుంటున్న వారికి, అలాగే కండరాల నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాయామం చేసేవారికి ఈ కూర చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఆరోగ్య ప్రయోజనాలు:

మేక మెదడులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. అయితే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పదార్థాలు శరీరానికి శక్తిని అందించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యానికి, హృదయ ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. తద్వారా రక్తహీనతను నివారిస్తుంది. ప్రోటీన్ కండరాల మరమ్మత్తుకు, పెరుగుదలకు కీలకం.

అంతేకాకుండా, మేక మెదడు రక్తం గడ్డకట్టకుండా చేసి, శరీరంలో రక్త ప్రవాహాన్ని సక్రమంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది. తద్వారా ఆక్సిజన్ రవాణాను మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచే గుణాలు కూడా దీనిలో ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే కొలెస్ట్రాల్, కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు ఉన్నవారు మితంగా తీసుకోవాలి.

మేక మెదడు కర్రీని ఇలా తయారు చేసుకోండి..

ఈ రుచికరమైన కూరను తయారుచేయడానికి, ముందుగా తాజా మేక మెదళ్లను పసుపు, ఉప్పు వేసిన నీటిలో 2-3 నిమిషాలు ఉడికించి, శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత, నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. శుభ్రం చేసిన మెదళ్లను వేసి, పసుపు, ఉప్పు, కారం కలిపి నిదానంగా వేయించుకోవాలి. లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జీలకర్ర, ధనియాలు, గసగసాలతో తయారుచేసిన మసాలా పేస్ట్‌ను వేసి, తగినంత నీళ్లు పోసి ఉడికించాలి. మెదళ్లు మెత్తబడిన తర్వాత ముక్కలుగా కట్ చేసి, మూతపెట్టి పది నిమిషాలు ఉడికించి, చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరిపోతుంది..

గమనిక: ఈ కథనంలో అందించిన విషయాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. ఏమైనా సమస్యలుంటే.. ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..