
ప్రతి ఉదయం బాగుంటే.. ఆ రోజంతా హరివిల్లులా ఉంటుంది. అందుకు నిద్రలేచిన వెంటనే చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. అవును.. రోజంతా ఎలా ఉంటుందనేది మన ఉదయం దినచర్యపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. రోజు సానుకూలతతో ప్రారంభమైతే ఆ రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. ఐతే నేటి జీవనశైలి కారణంగా మన ఉదయపు అలవాట్లతో కొన్నిసార్లు రోజంతా అప్‌సెట్ అవుతుంటుంది. ప్రతి రోజు సానుకూలంగా ప్రారంభంకావాలంటే ఈ కింది అలవాట్లను వదులుకోవాలి. అంటే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదయం పూట ఈ పనులు చేయకూడదు. రోజును నాశనం చేసే ఆ ఉదయం అలవాట్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే తొలుత ఫోన్ చెక్ చేసుకునే అలవాటు ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే.. ఇలాంటి వారికి ప్రతి రోజు ఫోన్‌తోనే ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదయం నిద్ర లేవగానే మీ ఫోన్ చెక్ చేసుకోకూడదన్నమాట. ఈ అలవాటు మీ మెదడుపై భారాన్ని పెంచుతుంది. దీనివల్ల మీరు మీ పనిపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. మరో విషయం ఏమిటంటే.. ఉదయం నిద్ర లేవగానే మీ మొబైల్ చెక్ చేసి చెడు వార్తలు చూస్తే మీ రోజంతా ఎందుకో ముభావంగా ప్రారంభమవుతుంది. కాబట్టి, ఈ అలవాటును వదులుకోండి.
చాలా మంది కాలేజీకి లేదంటే ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఆలస్యం అవుతుందని బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటారు. ఉదయం తినకుండా ఆకలితో ఉండటం హానికరం. ఇది మెదడు శక్తిని తగ్గిస్తుంది. ఇది మీ ఏకాగ్రత, మానసిక స్థితి రెండింటినీ ప్రభావితం చేస్తుంది.
ఉదయం నీరు త్రాగడం అలవాటు చేసుకోవాలి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగాలి. ఉదయం నీరు త్రాగడం వల్ల మెదడు కణాలు చాలా చురుగ్గా ఉంటాయి.
ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం కూడా మంచిది కాదు. ఇలా ఆలస్యంగా నిద్రలేస్తే, రోజంతా జడత్వంతో నిండిపోతుంది. మీరు రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా ఉండాలనుకుంటే ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు చేసుకోండి.
చాలా మందికి ఉదయం నిద్రలేచిన తర్వాత కొంతసేపు మంచం మీద కూర్చుని తమ వ్యక్తిగత సమస్యల గురించి ఆలోచించే అలవాటు ఉంటుంది. ఇది మనశ్శాంతిని దెబ్బతీస్తుంది. ఇది రోజంతా చిరాకు తెప్పిస్తుంది. కాబట్టి రోజును సానుకూల ఆలోచనలతో ప్రారంభించండి.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.