మీ అరచేతిలోనే మీ లివర్ గుట్టు.. ఇలా కనిపిస్తే ప్రమాదంలో ఉన్నట్లే.. వెంటనే అలర్ట్ అవ్వండి..
మన శరీరంలో అత్యంత నిశబ్దంగా పనిచేసే అవయవం ఏదైనా ఉందంటే అది కాలేయమే. లివర్ 70 శాతానికి పైగా పాడయ్యే వరకు ఎలాంటి నొప్పీ తెలియదు.. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. అయితే కాలేయం ప్రమాదంలో పడినప్పుడు మన శరీరం ముందుగానే కొన్ని స్పష్టమైన వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుంది. ముఖ్యంగా మీ అరచేతులు, గోళ్లలో వచ్చే చిన్నపాటి మార్పులను గమనిస్తే రాబోయే పెను ప్రమాదాన్ని ముందే కనిపెట్టవచ్చు.

మన శరీరంలో కాలేయం అత్యంత కీలకమైన అవయవం. రక్తంలోని విషపదార్థాలను శుభ్రపరచడం, ఆహారాన్ని జీర్ణం చేయడం, ప్రోటీన్లు, హార్మోన్ల సమతుల్యతను కాపాడటం వంటి ఎన్నో కీలక విధులను ఇది నిర్వర్తిస్తుంది. అయితే కాలేయానికి ఏదైనా నష్టం వాటిల్లితే ఆ ప్రారంభ సంకేతాలు అంత సులభంగా బయటపడవు. పరిస్థితి విషమించే వరకు చాలామందికి లివర్ డ్యామేజ్ అవుతోందన్న విషయం అర్థం కాదు. కానీ మన చర్మం, గోళ్లు, చేతుల్లో వచ్చే కొన్ని చిన్నపాటి మార్పులను నిశితంగా గమనిస్తే.. కాలేయ వ్యాధులను ప్రారంభంలోనే గుర్తించి ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. సాధారణంగా కాలేయం దెబ్బతిన్నప్పుడు శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల అరచేతుల కింద ఉండే చిన్న రక్తనాళాలు విస్తరించి, అరచేతులు అసాధారణంగా ఎరుపు రంగులోకి మారతాయి. అరచేతులు విపరీతంగా ఎర్రబడటం అనేది ఫ్యాటీ లివర్, హెపటైటిస్ లేదా లివర్ సిర్రోసిస్ వంటి తీవ్ర సమస్యలకు ముఖ్యమైన సంకేతం.
వేళ్లు ముడుచుకుపోవడం, చర్మం గట్టిపడటం
వేళ్లు మామూలు కంటే ఎక్కువగా లోపలికి వంగిపోవడం లేదా అరచేతి కండరాలు బిగుసుకుపోయి లోపలికి లాగినట్లు అనిపిస్తే తేలిగ్గా తీసిపారేయకండి. దీనికి కారణం అరచేతిలోని కణజాలం మందంగా, గట్టిగా మారడమే. దీర్ఘకాలికంగా మద్యం సేవించే వారిలో, సిర్రోసిస్ బారిన పడిన వారిలో ఈ రకమైన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
గోళ్ల రంగు, ఆకృతిలో మార్పులు
గోళ్లు పూర్తిగా తెల్లగా మారిపోయి, పైభాగంలో మాత్రం సన్నటి ఎరుపు లేదా గులాబీ రంగు చార కనిపిస్తే.. అది రక్త ప్రసరణ లోపాన్ని, కాలేయంలో ప్రోటీన్ ఉత్పత్తి దెబ్బతినడాన్ని సూచిస్తుంది. అలాగే గోళ్లు ఉబ్బినట్లుగా గుండ్రంగా మారి వెడల్పుగా పైకి లేస్తే కాలేయం లేదా ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు అనుమానించాలి.
అరచేతులు, అరికాళ్లలో నిరంతర దురద
కాలేయం దెబ్బతిన్నప్పుడు పైత్యరసం ప్రవాహం మందగించి, బైల్ సాల్ట్స్ రక్తంలో కలిసిపోతాయి. దీని ఫలితంగా అరచేతులు, అరికాళ్లలో విపరీతమైన దురద వస్తుంది. ఈ సమస్య ముఖ్యంగా పగటిపూట కంటే రాత్రి వేళల్లో మరింత తీవ్రమవుతుంది. దీంతో పాటు చేతులు, కాళ్లలో వాపులు కనిపించడం కూడా లివర్ వైఫల్యానికి సూచికే.
చేతులు వణకడం, చల్లబడటం
రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల అరచేతులు, పాదాలు ఎల్లప్పుడూ చల్లగా అయిపోతాయి. అంతేకాకుండా కాలేయ వ్యాధి తీవ్ర దశకు చేరుకున్నప్పుడు రక్తంలోని వ్యర్థాలు మెదడుపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల చేతులపై నియంత్రణ తప్పి, అవి అదుపులేకుండా వణకడం మొదలవుతుంది. ఇది అత్యంత ప్రమాదకర దశ కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఈ అదనపు లక్షణాలనూ విస్మరించవద్దు
చేతులు, గోళ్లలో మార్పులతో పాటు విపరీతమైన అలసట, ఆకలి మందగించడం, మూత్రం ముదురు పసుపు రంగులోకి మారడం, కడుపు ఉబ్బరం లేదా పొత్తికడుపులో అసౌకర్యం వంటి సమస్యలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే లివర్ ఫంక్షన్ టెస్ట్ వంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది.
(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. సరైన రోగ నిర్ధారణ, చికిత్స కోసం తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.)
