Pista: పిస్తాతో ఆ సమస్యకు కూడా చెక్.. పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు..
పిస్తాతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిసిందే. రెగ్యులర్‌గా పిస్తాను తీసుకుంటే క్యాన్సర్ మొదలు, గుండె సంబంధిత సమస్యల వరకు అన్ని బలదూర్ అవుతాయి. అయితే పిస్తాతో కంటి సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయని తాజా పరిశోధనల్లో తేలింది. ఇంతకీ కంటి సమస్యలను పిస్తా ఎలా దూరం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
పిస్తా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. ధర ఎక్కువైనా లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. ప్రతీ రోజూ పిస్తా తినడం వల్ల జ్ఞాపకశక్తి మొదలు గుండె సంబంధిత సమస్యల వరకు అన్ని రకాల సమస్యలు దూరమవుతాయని అంటున్నారు. క్యాన్సర్‌ను తరిమికొట్టడంలో కూడా పిస్తా ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులోని ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.
అంతేకాకుండా పిస్తాలో విటమిన్ డి, క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేస్తాయి. బోలు ఎముక వంటి ఎన్నో సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పిస్తాతో మరో లాభం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పిస్తా పప్పును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
అమెరికాలోని టఫ్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. పిస్తా పప్పుల్లో ల్యూటెన్ అనే పదార్థం ఉంటుందని ఇది కంటికి ఎంతగానో మేలు చేస్తుందని చెబుతున్నారు. మాక్యులర్ పిగ్‌మెంట్ ఆప్టికల్ డెన్సిటీ (ఎమ్‌పీఓడీ) అనేది కంటి ఆరోగ్యంలో చాలా కీలకం. వయసు పెరుగుతున్నకొద్దీ ఈ ఎమ్‌పీఓడీ తగ్గి, కళ్లు తీవ్రమైన కాంతిని తట్టుకోలేవు.
మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ భారీగా పెరుగుతోన్న ప్రస్తుత తరుణంలో ఫోన్ నుంచి వచ్చే నీలి కిరణాలు కంటి సంబంధిత సమస్యలను ఎక్కువ చేస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం వెతికేందుకు గాను మధ్యవయస్కులని ఎంచుకున్నారు. వీరికి పన్నెండు వారాలపాటు తగు మోతాదులో పిస్తాలను అందించారు. ఆ తర్వాత పరీక్షించగా వారిలో.. ఎమ్‌పీఓడీ స్థాయిలు మెరుగైనట్టు తేలింది. దాంతోపాటే పిస్తాలోని మంచి కొవ్వులు మెదడు పనితీరుని చురుగ్గా ఉంచడమూ శాస్త్రవేత్తలు గమనించారు. కాబట్టి భవిష్యత్తులో కంటి సంబంధిత సమస్యల బారిన పడకుండడా ఉండాలంటే పిస్తాను తీసుకోవాలని చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..