
శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది హిందూ సంప్రదాయంలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినం.. శుక్రవారం కృష్ణాష్టమి పండుగ వేడుకలను దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. అయితే, ఈ శుభదినాన కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలలో అటుకుల ప్రసాదం ఒకటి. దీనిని చాలా తక్కువ సమయంలో, కేవలం పది నుంచి పదిహేను నిమిషాలలోనే రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఈ కథనంలో కృష్ణాష్టమికి ప్రత్యేకమైన ఈ అటుకుల ప్రసాదాన్ని ఇంట్లో సులువుగా, కమ్మగా ఎలా తయారు చేయాలో వివరంగా తెలుసుకుందాం..
బెల్లం నీళ్లు సిద్ధం చేయడం: ముందుగా, ఒక పాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. అందులో ఒక కప్పు బెల్లం తురుము వేసి, దానికి రెండు కప్పుల నీళ్లు పోయాలి. బెల్లాన్ని కలుపుతూ అది పూర్తిగా కరిగే వరకు ఉంచాలి. మనకు పాకం అవసరం లేదు, కేవలం బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత, స్టవ్ పై నుంచి పాన్ ను తీసి పక్కన పెట్టుకోవాలి. బెల్లంలోని మలినాలను తొలగించడానికి దీనిని తర్వాత వడగట్టాలి.
డ్రై ఫ్రూట్స్ వేయించడం: ఇప్పుడు, అదే స్టవ్ పైన మరొక పాన్ పెట్టి, ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత, రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ బాదంపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. కావాలనుకుంటే, కొన్ని ఎండుద్రాక్షలను కూడా వేసుకోవచ్చు. ఇవి బంగారు రంగులోకి మారిన తర్వాత, వాటిని తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి.
కొబ్బరి వేయించడం: డ్రై ఫ్రూట్స్ వేయించిన అదే నేతిలో, అర కప్పు ఎండుకొబ్బరి తురుము వేసి దోరగా వేయించుకోవాలి. ఎండుకొబ్బరి వద్దు అనుకుంటే, పచ్చి కొబ్బరి తురుమును కూడా వాడుకోవచ్చు. అది కూడా రుచిగా ఉంటుంది. కొబ్బరి తురుము కూడా బంగారు రంగులోకి మారిన తర్వాత, దానిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.
అటుకులు వేయించడం: ఇప్పుడు, అదే పాన్ లోకి మరొక టీ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత, మనం ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో, అదే కప్పుతో ఒకటిన్నర కప్పు లావు అటుకులను వేసుకోవాలి. సన్నటి అటుకులను వాడితే ప్రసాదం ముద్ద ముద్దగా అయ్యే అవకాశం ఉంది, కాబట్టి లావు అటుకులను వాడటం మంచిది. అటుకులను లో-టు-మీడియం మంటపై లైట్ గా రంగు మారి, క్రిస్పీగా అయ్యే వరకు దోరగా వేయించుకోవాలి.
ప్రసాదం తయారీ: అటుకులు బాగా వేగిన తర్వాత, ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లను వడగట్టి, వేయించిన అటుకుల పాన్ లో పోయాలి. ఇలా వడగట్టడం వల్ల బెల్లంలోని మలినాలు తొలగిపోతాయి. బెల్లం నీళ్లు పోసిన తర్వాత, బాగా కలిపి మీడియం మంటపై అటుకులను ఉడకనివ్వాలి. అటుకులు నీటిని పీల్చుకొని దగ్గర పడటం మొదలవుతాయి.
చివరి మెరుగులు: నీళ్లు మొత్తం ఇంకిపోయి అటుకులు దగ్గర పడినప్పుడు, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసి లో ఫ్లేమ్ లో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ప్రసాదం కొద్దిగా పొడిపొడిగా మారుతుంది. మీకు మరింత పొడిపొడిగా కావాలంటే, బెల్లం నీళ్లు పోసేటప్పుడు కొద్దిగా తగ్గించి పోసుకోవచ్చు. చివరిగా, అర టీ స్పూన్ యాలకుల పొడి, వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పులను కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి.
మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, కమ్మని, రుచికరమైన అటుకుల ప్రసాదం సిద్ధం. ఇది ఆరిన తర్వాత మరింత పొడిపొడిగా మారుతుంది. ఈ కృష్ణాష్టమికి కృష్ణుడికి నైవేద్యంగా ఈ సులభమైన ప్రసాదాన్ని తయారు చేసి పెట్టండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..